వివిధ విభాగాల్లో ప్రతిభను చూపే వారిని బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. ఇది సంప్రీతి యాదవ్ అనే యువతికి సరిగ్గా సరిపోతుంది. చదువు ముఖ్యంగా భావించే సంప్రీతి దానితో పాటు ఆటలు, సంగీతం, డ్యాన్స్ వంటి అన్ని రంగాల్లో ముందుంటుంది. ఇక కొంతమంది యువత ఒక్క జాబ్ తెచ్చుకోవడానికే చాలా ఇబ్బందులు పడుతుంటారు. సంప్రీతి తన ప్రతిభతో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో నాలుగు పెద్ద సంస్థల్ని మెప్పించింది. తాజాగా గూగుల్ లో రూ.కోటి పైనే వార్షిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని పొందింది. గూగుల్ సంస్థలో కోటికి పైగా వేతనం తీసుకునే స్థాయికి సాగిన ఆమె ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంప్రీతి యాదవ్ ది బిహార్ లోని పాట్నా. ఆమె తండ్రి రామశంకర్ యాదవ్, తల్లి శశిప్రభ. రామశంకర్ ఫైనాన్స్ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగి. శశి ప్రభ కూడా పట్టణాభివృద్ధి విభాగంలో పని చేస్తోంది. వారు ఇద్దరు ఉద్యోగులు కావడంతో వారి ప్రభావం సంప్రీతి పై ఎక్కువగా ఉండేది. ఉన్నత స్థాయిలో స్థిరపడి అమ్మనాన్నలకు మంచి పేరు తేవలనేది ఆమె కల. అందుకు తగ్గటే స్కూల్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు అన్ని తరగతుల్లో ప్రీతి ముందే ఉండేది.
గత ఏడాది ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇంజనీరింగ్ చివరి ఏడాదిలోనే క్యాంపస్ సెలక్షన్స్ లో ఒక్కేసారి నాలుగు టాప్ MNC కంపెనీలో ఉద్యోగావకాశాలను దక్కించుకుంది. వాటిలో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీని సంప్రీతి ఎంచుకోని ఉద్యోగంలో చేరింది. అక్కడ ఆమె వార్షిక వేతనం రూ.44 లక్షలు. అక్కడ పనిచేస్తున్నా కూడా ఇంకా మంచి వేతనం సాధించాలని ఆమె అనుకుంది. అందుకోసం మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేస్తూనే గూగుల్ కు దరఖాస్తు చేసుకుంది. 9 అంచెల్లో సాగిన ఈ ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తిచేసుకుని రూ.1.10 కోట్ల వార్షిక వేతనంతో కొలువు దక్కించుకుంది.
సంప్రీతికి శాస్త్రీయ సంగీతంలోనూ మంచి ప్రావీణ్యముంది. నాటకాలు, ఆటలన్నా ఇష్టమే. ఐఐటీ- దిల్లీ, ముంబయిల్లో పలు పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించింది కూడా. ఇన్నింట్లో ఎలా రాణిస్తున్నావు అని కొందరు అడిగిన ప్రశ్నకు.. ఫలితం గురించి ఆలోచించకుండా, ఇష్టంగా కష్టపడితే అనుకున్న స్థానానికి చేరడం సులువే అంటోంది సంప్రీతి యాదవ్. చదువుతో పాటు మిగిలిన వాటిల్లో ముందు ఉంటూ.. ఆమె తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన సంప్రీతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.