ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను వేల సంఖ్యల్లో తొలగించే పనిలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా లాంటి దిగ్గజ సంస్థల్లో వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదేబాటలో వీడియో టెక్నాలజీ సంస్థ జూమ్ చేరింది. తమ సంస్థ నుంచి 1300 మంది ఎంప్లాయిస్ ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తమ కంపెనీలో 15 శాతం మందిని తొలగిస్తున్నట్లు సీఈఓ ఎరిక్ యువాన్ సంస్థ అధికారిక బ్లాగ్ లో పోస్ట్ చేశారు.
ప్రపంచంలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో వర్క్ ఫ్రమ్ హోం చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో డిమాండ్ కి తగ్గట్టు ఎంప్లాయీస్ ని తీసుకోవాల్సి వచ్చిందని.. ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేసేవారి సంఖ్య తగ్గిపోవడంతో డిమాండ్ తగ్గిపోయిందని.. అందుకే కొంత మంది ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎరిక్ వివరణ ఇచ్చారు. కోవిడ్ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా రెండేళ్ల వ్యవధిలో మూడు రెట్లు ఎక్కువగా ఉద్యోగులను నియమించుకున్నామని.. ప్రస్తుతం అలా కొనసాగించడం చాలా కష్టంగా ఉందని అన్నారు. సంస్థ భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. సంస్థ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన 1300 మంది ఉద్యోగులకు గుడ్ బై అంటూ భావోద్వేగంతో తన బ్లాక్ లో రాసుకొచ్చారు. తనను అర్థం చేసుకొని క్షమిస్తారని భావిస్తున్నాని కోరారు.
అమెరికాలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ కి ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపించనున్నట్లు సీఈఓ ఎరిక్ యువాన్ తెలిపారు. 30 నిమిషాల్లో ఇంపాక్టడ్ మెయిల్ వస్తుందని ఆయన తెలిపారు. అమెరికా కాకుండా ఇతర ప్రదేశాల్లో చేస్తున్న ఉద్యోగులకు స్థానిక విధానాలను బట్టి సమాచారం అందిస్తామన్నారు. ఇక అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులకు 16 వారాల వేతనంతో పాటు బోనస్, హెల్త్ కవరేజ్ అందజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా సీఈఓ ఎరిక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన జీతం నుంచి 98 శాతం కోత విధించుకున్నట్లు కీలక నిర్ణయం ప్రకటించారు.