అమెరికా ఊహించిందే జరిగింది.. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుందని చెప్పిన విధంగానే.. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆరంభం అయ్యింది. శాంతి చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించాలని అంతర్జాతీయ దౌత్యవేత్తలు ప్రయత్నించారు. కానీ చర్చలు విఫలమయ్యాయి. ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు.. ఆఖరికి అగ్ర దేశమైన అమెరికా సైతం రష్యా దూకుడు ఆపాలని చూసినప్పటికి కుదరలేదు. ఉక్రెయిన్ పై యుద్ధానికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించినప్పటికీ రష్యా తన పంథా మార్చుకోలేదు. మొత్తానికి రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించింది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకర్లతో రష్యా సైన్యాలు ఉక్రెయిన్ లో మోహరించాయి. ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ కు తూర్పున ఉన్న డొనెటస్క్, లుగాన్స్క్ లను స్వతంత్ర దేశాలుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం సంచలనంగా మారింది.
నిజానికి.. ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడం రష్యా ఉద్దేశం కాదు. ఉక్రెయిన్ తమ చెప్పు చేతల్లో ఉండాలి.. తాము చెప్పినట్టు వినాలి.. ఇదే రష్యా ఆలోచన! ఇందుకోసం ప్రపంచదేశాలను సైతం ఎదిరించడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఆఖరికి అమెరికాని సైతం లెక్కచేయడం లేదు. అసలు రష్యా, ఉక్రెయిన్ విషయంలో ఎందుకు ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుంది.. రష్యా-ఉక్రెయిన్ మధ్య సంబంధాలు ఎందుకు చెడిపోయాయి.. అసలు దేని కోసం రష్యా, ఉక్రెయిన్ ను తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలనుకుంటుంది.. అసలు ఈ యుద్ధానికి కారణం ఏమిటన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం…
రష్యా.. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఇగో, రెండవది సెల్ఫ్ డిఫెన్స్, మూడవది వ్యాపార ప్రయోజనాలు. అసలు ఈ యుద్ధం గురించి తెలుసుకోవాలంటే.. ముందుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల నేపథ్యం గురించి తెలుసుకోవాలి. సోవియట్ యూనియన్ చరిత్ర గురించి తెలుసుకోవాలి.
సోవియట్ యూనియన్.. దీన్నే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అంటారు. ఇందులో రష్యా, ఉక్రెయిన్, బెలరస్, ఉజ్బెకిస్తాన్ ఇలా 15 దేశాలు కలిసి ఒకటిగా ఉండేవి. ఈ యూనియన్ ని 1922 డిసెంబర్ 30 న వ్లాదిమిర్ లెనిన్ అనే సోషలిస్ట్ స్టార్ట్ చేశాడు. అయితే ఆఫ్గనిస్తాన్, రష్యా మధ్య జరిగిన యుద్ధం కారణంగా ఈ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యింది. ఆఫ్గనిస్తాన్ కు అమెరికా మద్దతు కారణంగా.. రష్యా అంత చిన్న దేశం చేతిలో ఓటమి పాలయ్యింది. అప్పటి నుంచి అమెరికా, రష్యా శత్రుదేశాలుగా మారాయి. ఈ ఓటమితో సోవియట్ యూనియన్ లో చీలికలు వచ్చాయి. ఒక్కొక్క దేశం సోవియట్ యూనియన్ నుండి బయటకి వచ్చేశాయి. ఈ క్రమంలోనే 1991 డిసెంబర్ 1 న ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇది రష్యాకు నచ్చలేదు.
నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949 లో సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా మొదలైన ఆర్గనైజేషన్ ఇది. దీన్ని రష్యా ప్రధాన శత్రువైన అమెరికానే స్టార్ట్ చేసింది. ఇందులో యూఎస్ తో పాటు యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి 30 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అలాంటి నాటో సంస్థలో ఇప్పుడు ఉక్రెయిన్ సభ్యత్వం కోసం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తోడు అమెరికా కూడా ఉక్రెయిన్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది రష్యాకు నచ్చడం లేదు. దీంతో ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో చేరకూడదని, ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వకూడదని రష్యా డిమాండ్ చేస్తుంది.
ఎందుకంటే ఒకప్పుడు అమెరికా తన స్వార్థం కోసం ఆఫ్గనిస్తాన్ లో ఎలాంటి చర్యలకు పాల్పడిందో.. ఇప్పుడు ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకుని అలానే ప్రవర్తిస్తుంది. దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది రష్యానే. అందుకే ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవద్దని రష్యా డిమాండ్ చేస్తోంది. ఈ కారణంగానే 2014 లో ఉక్రెయిన్ లో భాగమైన క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించి రష్యాలో కలిపేసుకుంది. దీంతో రష్యా – ఉక్రెయిన్ రెండు దేశాల మధ్య ఉన్న రిలేషన్ పూర్తిగా చెడిపోయింది.
ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాది కేవలం ఇగో మాత్రమే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ అవసరం కూడా ఉంది. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో పశ్చిమ దేశాలు రష్యాపై దాడి చేసినప్పుడు ఉక్రెయిన్ ను అడ్డుగా పెట్టుకుని తమ దేశాన్ని కాపాడుకుంది రష్యా. ఉక్రెయిన్ ను తమ దేశానికి అతి పెద్ద సెక్యూరిటీ వాల్ గా భావిస్తుంది రష్యా. ఎందుకంటే రష్యాపై దాడి చేయాలంటే ఉక్రెయిన్ ను దాటుకుని రావాలి. క్రిమియాని ఆక్రమించిన తర్వాత రష్యా రాజధాని అయిన మాస్కో ఉక్రెయిన్ నుండి 1600 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఒకవేళ ఉక్రెయిన్ నాటో గ్రూప్ లో చేరితే నాటోదళాలు తిరిగి క్రిమియాని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తాయి. అదే జరిగితే ఉక్రెయిన్ కు, రష్యా రాజధాని అయిన మాస్కోకు మధ్య దూరం తగ్గిపోతుంది. అప్పుడు కేవలం 640 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అది దేశభద్రతకు అత్యంత ప్రమాదకరం అని రష్యా భావిస్తుంది. పైగా.. ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వడం వల్ల నాటో కూటమిలో ఉన్న దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇందుకే రష్యా భయపడుతుంది.
మరోవైపు ఉక్రెయిన్ విషయంలో వెనక్కి తగ్గకపోతే ఎగుమతులు-దిగుమతులు నిలిపివేస్తామని చాలా దేశాలు రష్యాని హెచ్చరిస్తున్నాయి. అయినా గాని.. రష్యా తగ్గేదెలే అన్న చందాన వార్ ప్రకటించింది. ఇంతలా రష్యా ఎందుకు రిస్క్ చేస్తుంది అంటే, దానికి మూడవ కారణం వ్యాపార ప్రయోజనాలు. ఉక్రెయిన్ బోర్డర్ దగ్గర ఉన్న నల్ల సముద్రం (black sea) రవాణా విషయంలో.. అందులో దొరికే ఖనిజాల విషయంలో రష్యాకు ప్రయోజనం ఉంటుంది. కాబట్టి రష్యా ఇంతటి సాహసానికి ఒడిగడుతుంది. USSR సోవియట్ యూనియన్ సమయంలో రష్యా తర్వాత రెండో అత్యంత శక్తివంతమైన దేశం ఉక్రెయిన్ కావడం.. డిఫెన్స్, న్యూక్లియర్, మిసైల్ ఇండస్ట్రీస్, ఖనిజ సంపద విషయంలో రష్యాకి అనువుగా ఉండడం, ఆర్ధికపరంగాను, కీలకమైన వ్యూహాలను రచించేందుకు ఉక్రెయిన్ బ్లాక్ సీ తమకు ఎంతగానో తోడ్పడడం వంటి అంశాలు ఉక్రెయిన్ ని రష్యాకి కీలకంగా మార్చాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఉక్రెయిన్ పై పెత్తనం ఎవరు చెలాయించాలి అన్న విషయంపై జరుగుతున్న యుద్ధం ఇది. ప్రత్యక్షంగా యుద్ధం ఉక్రెయిన్ కి, రష్యా మధ్య జరుగుతున్నా గాని.. పరోక్షంగా ఇది అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధమే. క్లియర్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ కు పశ్చిమాన ఉన్న భాగాన్ని ఐరోపా దేశాలు, తూర్పు భాగాన్ని రష్యా వాడుకుంటున్నాయి. అయితే ఉక్రెయిన్ ని రష్యా కంట్రోల్ చేయడం అనేది ఈ ఐరోపా దేశాలకు నచ్చడంలేదు. ముఖ్యంగా అమెరికాకు నచ్చడం లేదు. రష్యా వల్ల దౌత్యపరమైన సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో ఉక్రెయిన్ పై రష్యా పెత్తనానికి చెక్ పెట్టాలని చూస్తున్నాయి. మరి ఈ యుద్ధం పరిణామాలు ఎలా ఉండనున్నాయి.. ఎప్పటికి ముగుస్తుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.