అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనయుడు హంటర్ బైడెన్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తను చేసిన నేరాలను ఒప్పుకోవడంతో శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంది. అధ్యక్ష ఎన్నికల ముంగిట ఈ పరిణామం బైడెన్ కు ఎదురుదెబ్బ తగిలినట్టే అని విశ్లేషకులు అంటున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ పై పోటీ చేసి విజయాన్ని అందుకుని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఆ పదవిలో కొనసాగుతున్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ అధ్యక్షుడిగా తనదైన మార్క్ చూపిస్తున్నారు. అయితే తాజాగా బైడెన్ కొడుకు ఓ కేసులో నేరాన్ని అంగీకరించడంతో జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ వార్త అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు రానున్న వేళ అధ్యక్షుడు బైడెన్ కు ఎదురుదెబ్బ తగిలినట్టుగా బావిస్తున్నారు. ప్రతిపక్షపార్టీల వారు బైడెన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు బైడెన్ కొడుకు చేసిన నేరం ఏంటి? ఆయనకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? అసలు శిక్ష పడుతుందా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ల కుమారుడు హంటర్ బైడెన్ తనపై వచ్చిన అభియోగాపై స్పందిస్తూ ఆదాయ పన్ను చెల్లించలేదని ఒప్పుకున్నాడు. రెండు సార్లు ఫెడరల్ ఇన్ కం ట్యాక్స్ కట్టలేదని నేరాన్ని అంగీకరించాడు. అంతే కాకుండా చట్ట విరుద్దంగా ఆయుధాన్ని కలిగి ఉన్నట్టుగా కూడా వెల్లడించాడు. దీంతో ఆయనకు ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించి ఏడాది జైలు శిక్ష, లక్షడాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యంలో చట్టాలు ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించకుండా ఎంతటి వ్యక్తులనైనా శిక్షించే విధంగా చట్టాలను అమలు పరుస్తారు. మరి హంటర్ బైడెన్ విషయంలో చట్టాలు పనిచేస్తాయా, శిక్ష పడుతుందా అనేది వేచి చూడాల్సిందే.
హంటర్ బైడెన్ పన్ను ఎగవేత గురించి యూఎస్ అటార్నీ డేవిడ్ విస్ స్పందిస్తూ హంటర్ బైడెన్ ఉద్దేశ్యపూర్వకంగానే ఫెడరల్ ఇన్ కం ట్యాక్స్ చెల్లించలేదని తెలిపారు. అయితే ఆ నేరాన్ని హంటర్ బైడెన్ ఒప్పుకున్నట్లుగా తెలియజేశారు. 1.5 మిలియన్ డాలర్ల సంపాదనపై ట్యాక్స్ కట్టలేదని, దీనికి గాను ఆయనకు జైలు శిక్ష తో పాటు లక్ష డాలర్ల వరకు జరిమానా పడే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఈ విషయంపై జో బైడెన్, జిల్ బైడెన్ లు తమ కొడుకును ప్రేమిస్తున్నారని, హంటర్ బైడెన్ తన జీవితాన్ని పునర్నించుకోవడానికి మద్దతు ఇస్తున్నారని శ్వేత సౌధం ప్రతినిధి తెలిపారు.