ఆడబిడ్డ అయితే తీసేయండి అని, అబార్షన్ చేసేయండి, చెత్త కుప్పలో పడేయండి అని చులకన చేసే మనుషులున్న ఈ సమాజంలో ఆడపిల్ల పుడితే పండగ చేసుకునే మనుషులు ఉంటారా? అంటే ఉంటారు. ఆడపిల్ల పుట్టిందని తెలిసి తల్లిదండ్రులు, బంధువులు అంతా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే వారి వంశంలో 138 ఏళ్ల తర్వాత పుట్టిన మొట్టమొదటి ఆడబిడ్డ కాబట్టి. 138 ఏళ్ల కాలంలో ప్రతీ తరంలో వారి కుటుంబంలో అందరూ మగ పిల్లలే. ఒక్కసారి కూడా ఆడపిల్ల పుట్టలేదు. అందుకే తొలి ఆడబిడ్డ పుట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంది తమ వంశంలో అబ్బాయి మాత్రమే పుట్టాలని అనుకుంటారు. ఎందుకంటే వారిదో కృష్ణదేవరాయల సామ్రాజ్యం అని.. ఈ ప్రజలను ఉద్దరించడానికి తన తర్వాత ఒక వారసుడు కావాలని ఫీలింగు పెట్టేసుకుంటారు. అంతకు ముందు ఆ తండ్రి ఏదో దేశాన్ని ఉద్దరించినట్టు బిల్డప్ ఇస్తాడు. అక్కడ చూస్తే ఏముండదు, డొల్ల. తినడానికి తిండి, కట్టుకోవడానికి సరైన బట్ట లేకపోయినా గానీ వారసుడు మాత్రం కావాలి. అమ్మాయి పుడితే పీక పిసికి చంపేయడమో, చెత్త కుప్పలో పడేయడమో, డెలివరీ సమయంలో అమ్మాయి పుడుతుందని తెలుసుకుని అబార్షన్ చేయించడమో లాంటివి చేస్తారు. ఒకప్పుడంటే రాజుల కాలం.. రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం వారసులు ఉండాలన్న నియమం ఉండేది. అది కూడా వారు పెట్టుకున్నదే. అలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మాయి పుడితే ఇప్పటి అడవి మనుషుల్లా పురిట్లోనే చంపేయలేదు. అమ్మాయినే అబ్బాయిలా పెంచారు. దానికి రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీర నారీమణులే ఉదాహరణ.
కానీ ఇప్పటికీ గ్రామాల్లో అమ్మాయి పుడితే అయ్యో అమ్మాయి పుట్టిందా.. పర్లేదులే తర్వాత కాన్పులో అబ్బాయి పుడతాడని వెధవ సానుభూతి చూపించే అనాగరికులు ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఒకటే. ఎవరూ ఎందులో తక్కువ కాదని చదువుకున్న వారు అర్థం చేసుకుంటున్నారు. ఎవరు పుట్టినా సరే ఎగిరి గెంతులేస్తున్నారు. అబ్బాయి పుడితేనే కాదు, అమ్మాయి పుట్టినా మా ఇంట మహాలక్ష్మి పుట్టిందని పెద్ద ఎత్తున పండగలా సెలబ్రేట్ చేసుకునే తండ్రులు ఉన్నారు ఇంకా ఈ సమాజంలో. అబ్బాయి పుడతాడా? అబ్బాయి పుట్టాలి అని 9 నెలలు ఎదురుచూసే దంపతులు ఉండచ్చు. కానీ అమ్మాయి పుడితే బాగుణ్ణు అని 9 నెలలు ఉత్కంఠగా ఎదురుచూసే తల్లిదండ్రులు ఉంటారా? అంటే ఉంటారనడానికి ఈ దంపతులే నిదర్శనం.
డెలివరీ సమయంలో ఒకటే టెన్షన్. అమ్మాయి పుట్టింది. ఆ విషయం తెలియగానే తండ్రి ఆసుపత్రిలోనే గెంతులు వేశాడు. తల్లి కూడా పట్టరాని సంతోషం వ్యక్తం చేసింది. ఎందుకింత ఆనందం అంటే 138 సంవత్సరాల వరకూ వారి వంశంలో అసలు ఆడపిల్లే పుట్టలేదట. 1885 సంవత్సరం తర్వాత అంటే 138 ఏళ్ల తర్వాత అమ్మాయి పుట్టింది. అందుకే వాళ్ళు అంతలా సంబరాలు చేసుకుంటున్నారు. అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది ఈ ఘటన. మిషిగన్ లోని కెలడోనియాలో ఉండే ఆండ్రూ క్లార్క్-కరోలిన్ కుటుంబంలో 1885 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఆడపిల్ల పుట్టింది. వారి వంశంలో క్లార్క్ తోబోట్టువుల్లో ఎవరికీ ఆడపిల్ల పుట్టలేదు. అంతకు ముందు తరంలో కూడా పుట్టలేదు.
అమ్మాయి కోసం ఆ వంశం వారు శతాబ్దం పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అయినా ఫలితం లేదు. చివరకు 138 ఏళ్లకు ఆడపిల్ల పుట్టింది. దీంతో తల్లిదండ్రులు పుత్రికోత్సాహంతో ఎగిరి గంతులేస్తున్నారు. వారి వంశస్తులు దీన్నొక వేడుకలా జరుపుకుంటున్నారు. తమ కుటుంబంలో అమ్మాయి లేనందుకు చాలా బాధపడేదాన్నని, గర్భం దాల్చిన తర్వాత ఎవరు పుడతారన్న విషయాన్ని పట్టించుకోలేదని.. ఇప్పుడు పాప పుట్టడం చాలా సంతోషంగా ఉందని కరోలిన్ వెల్లడించింది. ఇప్పటి వరకూ అమ్మాయి పేరు గురించి ఆలోచించలేదని.. తొలిసారి పాపకు పేరు పెట్టడం కష్టంగా అనిపించిందని క్లార్క్ వెల్లడించాడు. ఎట్టకేలకు తన కుమార్తెకు ఆడ్రీ క్లార్క్ అని పేరు పెట్టాడు. క్లార్క్, కరోలిన్ దంపతులకు కామెరాన్ అనే నాలుగేళ్ల బాబు ఉన్నాడు. మరి 138 ఏళ్ల తర్వాత రాక రాక తమ ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చిందని సంబరాలు చేసుకుంటున్న ఈ కుటుంబంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.