హైదరాబాద్ క్రైం- ఈ మధ్యకాలంలో వ్యభిచారం బాగా పెరిగిపోయింది. పోలీసుల కళ్లు గప్పి హైటెక్ పద్దతిలో వ్యభిచారం నిర్వహిస్తున్నాయి కొన్ని ముఠాలు. ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్ లాంటి విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి బంగ్లాదేశ్ వ్యభిచార మఠాను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పాస్‌పోర్ట్ లేకుండా దేశంలోకి చొరబడి నగరంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడుగురిని హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముగ్గురు యువతులతో కలిసి ఓ యువకుడు హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆస్పత్రి సమీపంలోని బస్టాప్ లో నిలుచున్నాడు. అప్పటికే వీరి గురించి సమాచారం ఉన్న ఎస్సార్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే యువతుల్లో కంగారు మొదలైంది. ఏ మాత్రం ఆలస్యం చేసకుండా ముగ్గురు యువతులతో పాటు, మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో వాళ్లు చాలా విషయాలు చెప్పారు.
బంగ్లాదేశ్‌కు చెందిన ఖసుర్ దాస్ నూర్ మొహమ్మద్ కొలిబా, నహీదా ఖసుర్ దాస్‌లు దంపతులు 25ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి అక్రమంగా వచ్చారు. కొన్నాళ్లు ముంబయిలో ఉన్న వీళ్లు, అక్కడ ఆధార్ కార్డు సంపాదించారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి బోరబండలోని విజేత థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఖసుర్ దాస్ సోదరుడైన కచ్చి ముషారఫ్ సర్దార్ ఇటీవల పశ్చిమ బెంగాల్ మీదుగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు.
బోరబండలో ఉండే తన అన్నావదినల దగ్గర ఉంటున్న ఆతను, మెల్లగా వ్యభిచార కార్యకలాపాలు ప్రారంభించాడు. బంగ్లాదేశ్ కు చెందిన షాబుద్దీన్, మిలన్ అనే వ్యక్తులు పశ్చిమ బెంగాల్ మీదుగా ముగ్గురు యువతులను బ్రోకర్ అతియార్ మొండల్ అలియాస్ షాబుద్దీన్ మండల్ ద్వారా హైదరాబాద్ కు పంపించారు. ఈ ముగ్గురు యువతులకు కూడా ముషారఫ్ సర్దార్ నకిలీ ఆధార్ కార్డులు ఇప్పించాడు. ఇంకేముంది వీరితో ముషారఫ్ సర్దార్ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడం మెదలుపెట్టాడు.
ఈ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టిన పోలీసులు, పక్కా సమాచారంలో దాడులు నిర్వహించారు. ఎర్రగడ్డ బస్టాప్ లో ముగ్గురు బంగ్లాదేశ్ యువతులతో పాటు ముషారఫ్ ను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు బోరబండలోని ఖసుర్ దాస్ నూర్ మొహమ్మద్ కొలిబా, నహీదా ఖసుర్ దాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.