నచ్చిన అమ్మాయిని మాటల్లో పెట్టి, ప్రేమ అంటూ నటించి, వారితో కోర్కెలు తీర్చుకోవడం ఆ నీచుడి పని. ఇలానే ఢిల్లీలో ఓ అమాయకురాలికి కడుపు చేసి అడ్రెస్ లేకుండా పోయాడు. ఆమె మైనర్ బాలిక. ఇక 2022 జూలై 30 ఢిల్లీలోని ఒక హాస్పిటల్ నుంచి ద్వారకాలోని మహిళా సెల్‌కి ఫోన్ వచ్చింది. ఎస్.ఐ. ప్రియాంక ఆ కాల్ ఎత్తగానే మైనర్ బాలికకి జరిగిన అన్యాయం గురించి వివరించింది డాక్టర్. వెంటనే ఎస్.ఐ. ప్రియాంక హాస్పిటల్ కి వెళ్ళింది. బాధితురాలితో మాట్లాడి అతని వివరాలు సేకరించింది. ఆ సమయంలో ఆ రేపిస్ట్ గురించి ఎస్.ఐ. ప్రియాంకాకి రెండే రెండు విషయాలు తెలిశాయి. అతని పేరు ఆకాశ్. గాజుల బిజినెస్ చేస్తుంటాడు. అంతకు మించి ఒక్క క్లూ కూడా లేదు. ఈవెన్ ఫోన్ కాల్స్ కూడా లేవు. మాములుగా అయితే.., చాలా కేసుల్లానే ఇది కూడా మూలన పడిపోవాలి. కానీ.., ఎస్.ఐ. ప్రియాంకా ఆ మైనర్ బాలికకి న్యాయం చేయాలని అనుకుంది. దీంతో.., తన జీవితాన్ని కూడా రిస్క్ లో పెట్టి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.
ఆ రోజు రాత్రే తన ఫొటోతో ఫేస్ బుక్ లో ఓ ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఢిల్లీలో నివసిస్తున్న ఆకాశ్ అనే పేరున్న ఫేస్‌బుక్ ఐడిలకు రాండమ్‌గా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టడం మొదలెట్టింది. కొంత మంది యాక్సెప్ట్ చేశారు. వారిలో ఫిల్టర్ చేయడం మొదలు పెట్టింది. సరిగ్గా అర్ధరాత్రి 2గంటల సమయంలో ఒక వ్యక్తి నుండి తాను గాజుల డిజైనర్ అని సమాధానం వచ్చింది. అతన్ని కవ్విస్తూ మాట్లాడి.. మెసెంజర్‌లో అతని ఫోటో పెట్టించుకుంది ప్రియాంక. హాస్పిటల్ లో మైనర్ బాలికకి ఆ ఫోటో చూపిస్తే ఇతనే ఆకాష్ అని సమాధానం ఇచ్చింది.
ఇక్కడ కూడా ప్రియాంక తొందరపడలేదు. అతన్ని ప్రేమలోకి దింపింది. చాటింగ్ చేసింది. వీడియో కాల్స్ అటెండ్ చేసింది. మొత్తానికి ఆకాష్ ట్రాప్ లో పడ్డాక.., కూల్ గా డార్లింగ్ కలుద్దామా అమ్ని అడిగింది. అమ్మాయే ఆ మాట అనేసరికి ఆకాశ్ ఎగిరి గంతు వేశాడు. శ్రీమాతా మందిర్‌లో మీటింగ్ ఫిక్స్ చేసింది ప్రియాంక. ఖాకీ బట్టల్లో కాకుండా అక్కడికి చక్కగా తయారై వచ్చింది. ఆకాష్ ఆమె దగ్గరికి రాగానే మఫ్టీలో ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక లేడీ ఎస్.ఐ.ప్రియాంక తెలివిని, ధైర్య సాహసాలను డీసీపీ సంతోష్ కుమార్ అభినందించారు. నెటిజన్స్ ఆమెని ఒక్క రాత్రిలో స్టార్ ని చేసేశారు. ఈ దెబ్బతో ఇప్పుడు ఢిల్లీలో ప్రియాంక స్టార్ పోలీస్ అయిపోయింది. మరి.., ప్రియాంక ధైర్య సాహసాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.