హైదరాబాద్- టైటిల్ చూస్తేనే మీకు అర్ధమై ఉంటుంది. ఇది ఓ మహిళపై జరిగిన లైంగిక వేధింపులకు సంబందించిన అంశమని. అవును నిజమే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అందుకే సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టడానికి సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ పేరుతో ఏర్పాటైన ఈ ప్రత్యేక విభాగం మహిళలకు రక్షణ కల్పిస్తోంది.
టీనేజ్ యువతులు, మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి వారిపై జరుగుతున్న దాడులపై పోలీసులకు కంప్లైంట్ చేసేవిధంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాదు బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల ఆటకట్టించేందుకు షీటీమ్స్ డెకాయ్ ఆపరేషన్ కూడా చేపట్టాయి. ప్రస్తుతం సోషల్ మీడియా పెరిగిపోవడంతో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే వేధింపులపై ఎలా స్పందించాలి, లైంగిక వేధింపులకు సంబందించి పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలన్నదానిపై ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ అవగాహన కల్పిస్తోంది. ఇందుకు సంబందించి సైబర్ క్రైంపోలీసులు ఓ వాట్సాప్ చాటింగ్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసే అనన్య అనే ఓ యువతికి, ఆమె బాస్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని ఆ వాట్సాప్ చాట్ లో క్లియర్ గా ఉంది. ప్రాజెక్ట్‌ను అప్రూవ్ చేయాలన్నా, జీతం పెంచాలన్నా అంతా నా చేతుల్లో ఉందని, అందుకోసం ఓయో లో కలుద్దామని అసభ్యంగా ప్రవర్తించాడు ఓ నీచుడు.
ఐతే తన బాస్‌కు ఆ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ బుద్ధి చెప్పిన విధానం ఇతర యువతులకు అవగాహన కల్పించేలా ఉంది. లైంగిక వేధింపులకు ఏ మాత్రం కుంగిపోకుండా, దైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చని ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఈ వాట్సాప్ చాట్‌ను షేర్ చేసింది. ఇప్పుడు ఈ వాట్సాప్ చాట్ షేర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేను కూడా అలాంటి వాడిని కాదు. But నువ్వంటే క్రష్ ఉంది నాకు… From the first day. #Dial100 #cyberabadsheteam #WomenSafety pic.twitter.com/LUpKRjucLa
— Women & Children Safety Wing Cyberabad (@sheteamcybd) August 31, 2021