హైదరాబాద్- కరోనా మహమ్మారి సోకిందంటే చాలు.. దాన్ని విదిలించుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్కులకు లక్షల్లో వదిలించుకోవాలి. ఆస్పత్రిలో ఎన్ని రోజులు ఉంటే అన్ని లక్షలు చెల్లించాల్సిందే. అంతగా ఆర్థిక స్తోమత లేని వారు ఆస్తులను అమ్ముకుని, అప్పుల చేసి ఆస్పత్రుల ఫీజులు కడుతున్నారు. మరి కొందరైతే ఆస్పత్రి ఫీజు కట్టలేక, తమ వారి మృత దేహాలను అక్కడే వదిలేస్తున్నారు. ఇంతలా జీవితాలను ప్రభావితం చేస్తోంది కరోనా. ఇటువంటి సమయంలో కరోనా చికిత్సకు కేవలం 10 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకుంటున్న వైద్యులు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. అవును మీరు విన్నది నిజమే. కరోనా ట్రీట్ మెంట్ కు ఓ డాక్టర్ కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకుని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అంతే కాదు చికిత్సకు అవసరమైన మందులను సైతం అతి తక్కువ ధరకే అందిస్తూ సమాన్యుల పాలిట దైవంలా మారారు ఈ వైద్యుడు.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన పీర్జాదిగూడలో ప్రజ్వల క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యుయెల్ గోప్పతనమిది. ఆయన జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్‌తో ఎంబీబీఎస్ చదువుకున్నారు. పలు ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసిన ఆయన తర్వాత సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు. సాధారనంగా ఐతే తన దగ్గరకు వచ్చే రోగులకు కన్సల్టెన్సీ ఫీజు కింద 200 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ పేదరోగుల నుంచి మాత్రం కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకుంటుని తన సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికులు, ప్రజలకు అన్నం పెట్టే రైతులు, అనాథలు, దివ్యాంగులకు ఫీజు సహా జబ్బు నయం అయ్యే దాకా మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు డాక్టర్ ఇమ్మాన్యుయెల్. అంతే కాదు తనకు తెలిసిన కొందరు దాతలు సహకరించడంతో నిరుపేద రోగులకు కరోనా తో పాటు పలు ఆరోగ్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు ఈ వైద్యుడు.
ఇక కరోనా సోకిన నిరుపేద రోగులకు కరోనా పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు, వారికి మందులు సైతం ఉచితంగానే అందిస్తున్నారు. కరోనా తీవ్ర లక్షణాలు ఉండి ఆస్పత్రికి రాని రోగుల కోసం ఇతర వైద్యుల సహాయాన్ని తీసుకుంటున్నారు డాక్టర్ ఇమ్మాన్యూయెల్. ఇంటి వద్ద వైద్యం చేయించుకునే రోగుల కోసం నర్సులను సైతం పంపిస్తున్నారు. ఐతే ఇందుకు అయ్యే రవామా ఖర్చులను రోగులే భరించాల్సి ఉంటుంది. కరోనా చికత్స కోసం వైద్యం, పరీక్షలు, మందులు అన్నీ కలిపి కేవలం15వేల నుంచి 20 వేల రూపాయల లోపే ఖర్చయ్యేలా చేస్తున్నానని ఇమ్మాన్యుయెల్ తెలిపారు. దీంతో డాక్టర్ ఇమ్మాన్యుయెల్ నడిపిస్తున్న ప్రజ్వల క్లినిక్‌కు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.