చిత్తూరు- ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు ఉండగానే అప్పుడే రాజకీయ సమీకరణలపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఓడించి, అధికారం చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఓ టీడీపీ అభిమాని అడిగిన ప్రశ్నకు, ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో జనసేన మద్దతుతో ఎన్నికల బరిలో దిగిన చంద్రబాబు అధికారం చేపట్టారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి.
మళ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇరు పార్టీలో కలిసి పోటీ చేస్తాయా లేదా అనే దానిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. గురువారం తన సొంత నియోజకవర్గం కుప్పంలోని రామకుప్పం మండలం వీరనమల తండాలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేయాలని చంద్రబాబును ఓ టీడీపీ కార్యకర్త ఒకరు కోరారు.
దీనికి స్పందించిన చంద్రబాబు, ప్రేమ ఎప్పుడూ రెండు వైపుల ఉండాలని.. వన్ సైడ్ లవ్ చేయడం కరెక్ట్ కాదు.. అని చమత్కారంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు సమాధానానికి అక్కడున్న నేతలు, కార్యకర్తలు నవ్వేశారు. ఐతే జనసేనాని పవన్ కళ్యాణ్ ఓకే అంటే టీడీపీ పొత్తుకు సిద్దమని చంద్రబాబు పరోక్షంగా సంకేతం ఇచ్చారని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. మరి ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.