ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు అనౌన్స్ అవుతున్నాయంటే చాలు.. విలన్ రోల్ ఎవరు చేయబోతున్నారనే ఆసక్తి మొదలవుతుంది. ఎందుకంటే.. హీరోకి తగ్గ విలన్ ఉంటేనే అటు సగటు సినీ ప్రేక్షకుడికి, అభిమానులకు సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేసే అవకాశం దొరుకుతుంది. అందుకే టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సినిమాలలో విలన్స్ గా ఇతర ఇండస్ట్రీల నటులను తీసుకుంటున్నారు. అయితే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ఇది. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుండే సినిమాపై అంచనాలు హై లెవల్ కి చేరుకున్నాయి. అదీగాక ప్రస్తుతమ్ ఇద్దరూ కూడా వరుస హిట్లతో ఫామ్ లో ఉన్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన మరోసారి బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటించనుందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో విలన్ రోల్ పోషించబోయేది వీరేనంటూ పలువురి స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. మహేష్ – త్రివిక్రమ్ మూవీలో విలన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. దర్శకనిర్మాతలు విజయ్ సేతుపతితో చర్చలు జరపనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. విజయ్ సేతుపతి ఇటీవలే కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలో పోషించిన విలన్ రోల్ కి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. విక్రమ్ సినిమాలో విజయ్ కనబరిచిన విలనిజం చూసే త్రివిక్రమ్ టీం ఆయనను మహేష్ కి విలన్ గా తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. మరి మహేష్ కి విలన్ గా విజయ్ సేతుపతి వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.