ప్రస్తుతం ఎంటర్టైన్ మెంట్ విషయానికి వస్తే గత కొద్దిరోజులుగా ఆస్కార్ అవార్డులు, ఆస్కార్ కి ఇండియా నుండి నామినేట్ అవుతున్న చిత్రాలు అనే అంశాల చుట్టూ చర్చలు జరుగుతున్నాయి. అందులోనూ ఈ ఏడాది దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్‘(RRR) గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్.. రౌద్రం రణం రుధిరం.. పీరియాడిక్ జానర్ లో రూపొందిన చిత్రమిది. ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్లను, స్వాతంత్ర్య పోరాటం నేపథ్యాన్ని ఎంచుకొని.. ఇద్దరు స్టార్ హీరోలను ప్రధానం చేసుకుని తీసిన కమర్షియల్ చిత్రం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ప్రశంసలు పొందిన చిత్రం.. దాదాపు రూ. 1200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్.. కానీ, ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ కి ఎందుకు వెళ్లలేకపోయింది?
ఎవరైనా ఆలోచించారా..? అసలు ఆస్కార్ అవార్డులు ఎలాంటి సినిమాలకు వస్తాయి? ఎటువంటి సినిమాలకు ఇస్తారు? అని. గొప్ప చిత్రాలుగా పేరొందిన సినిమాలన్నీ అవార్డులు సాధిస్తాయా? ఆస్కార్ అనేది ఏమైనా సాదాసీదా పురస్కారమా? అసలు ఆస్కార్ వరకు వెళ్లాలంటే సినిమాలో ఏయే అంశాలుండాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారా.. మనకు నచ్చిన సినిమాలు కాకుండా ఏవో పేరు కూడా తెలియని సినిమాలు నామినేట్ అవుతున్నాయేంటని. వాటిలో అంత విషయముందా? అని. ఓ సినిమా పాపులర్ అవ్వొచ్చు.. కానీ, దానికి అవార్డు రాలేదనే వాదన చేసేముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మన సినిమా ఏ అవార్డు కోసం పోటీ చేయనుంది? ఆ అవార్డు పొందే అర్హతలు మన సినిమాలో ఉన్నాయా లేవా..? సపోస్ ఆస్కార్ అవార్డే అనుకుందాం.. రండి దాని గురించి కొంచం తెలుసుకుందాం!
ఆర్ఆర్ఆర్.. ఈ మధ్యకాలంలో వచ్చిన గొప్ప సినిమాలలో అది ఒకటని అనుకునేవారు కొంతమంది, ఇదొక్కటే గొప్ప సినిమా అనుకునేవారు మరికొంతమంది. ఆస్కార్.. ప్రపంచ సినిమాలో గొప్ప అవార్డు. ఆస్కార్.. ఓ సినిమాకు ఇచ్చే అవార్డు మాత్రమే కాదు.. ఓ దేశానికిచ్చే అవార్డు. ఎందుకంటే.. ఓ సినిమా ఆస్కార్ కొడితే, సంతోషిచేది ఆ చిత్రబృందమే కాదు.. దేశమంతా గర్వించే మూమెంట్ అది. అలాంటి గొప్ప మూమెంట్స్ ఊరికే వచ్చేస్తాయా? గొప్ప గొప్ప విజయాల వెనుక ఎంతో శ్రమ ఉండొచ్చు.. కానీ, ఆ శ్రమకు ఆస్కార్ ఎందుకు రాలేదని వాదించడం సబబు కాదు. ఆ సినిమాలో శ్రమ ఉందేమో.. కానీ, ఆస్కార్ ను అందుకునే గొప్ప విషయము సినిమాలో ఉందా? అన్నదే పాయింట్.
ఆర్ఆర్ఆర్.. సినిమాలో ఆస్కార్ సాధించే విషయం ఉందా లేదా? అనేది.. సగటు ప్రేక్షకుడి కన్నా ఆస్కార్ బరిలోకి సినిమాను ఎంపిక చేసి పంపే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(FFI) కమిటీకి తెలుసనీ, ఆ కమిటీ బాధ్యతే ఎక్కువగా ఉంటుందని ఎంతమందికి తెలుసు. ప్రతి సంవత్సరం ఇండియా నుండి ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లే సినిమాల వెనుక ఎఫ్ఎఫ్ఐ అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడు నియమించిన కమిటీ, చైర్మన్, సభ్యులు ఇలా చాలామంది ఉంటారు. వారే ఇండియా నుండి ఆస్కార్ కి వెళ్లాల్సిన సినిమాలేవో నిర్ణయిస్తారు. ఈసారి ఇండియా నుండి ఆస్కార్ రేసులోకి గుజరాతీ మూవీ చెల్లో షో(chhello show) మూవీని అధికారికంగా ఎంపిక చేసి పంపించారు. అసలు ఆ సినిమా పేరు కూడా ఇంతకుముందు ఎవరికీ పెద్దగా తెలియదు.
అలాంటిది ఆ సినిమా ఎంపిక చేసి.. బ్లాక్ బస్టర్ అయినటువంటి ఆర్ఆర్ఆర్ ని ఎందుకు పక్కన పెట్టేశారు? అని సగటు భారతీయ ప్రేక్షకులలో రగులుతున్న ప్రశ్న. ఆస్కార్ నామినేషన్స్ కి ముందు వరకూ ఆర్ఆర్ఆర్ గురించి ఎన్నో అంచనాలు, ఏవేవో ఊహాగానాలు.. ఆస్కార్ లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ ఒరిజినల్ సాంగ్.. ఇలా దాదాపు ఐదు కేటగిరిలలో ఈ సినిమా అవార్డులు కొట్టే ఛాన్స్ ఉందని, కొట్టేస్తుందని.. కొన్ని పేరుమోసిన నివేదికలు కథనాలు సృష్టించాయి. దీంతో ఆర్ఆర్ఆర్ పై అభిమానం పెంచుకున్న వారంతా ఆహా, ఓహో ఇదే గొప్ప అవకాశం.. ఇండియాకు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ తేవడం ఖాయం అంటూ ఊహల్లో మేడలు కట్టేసుకున్నారు.
కట్ చేస్తే.. ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఎదురుదెబ్బ అని, గుజరాతీ చిత్రాన్ని వరించిన అదృష్టం అంటూ.. కొత్త కథనాలు మొదలయ్యాయి. అక్కడినుండి ఆర్ఆర్ఆర్ కోసం పోరాటంలోకి దిగుతున్న అభిమానుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. దర్శకుడు రాజమౌళినే స్వయంగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొట్టినా కొట్టకపోయినా తాను సినిమాలు తీసే విధానం మారదని చెప్పేశాడు. ఆంటే.. గొప్ప సినిమా తీశాననే భావన రాజమౌళికి ఉంది.. కానీ, అవార్డు రానంతమాత్రాన బాధపడే అవసరం లేదనేది కూడా ఆయన భావంలో భాగం అయ్యుండొచ్చు. మీకు సందేహం కలగవచ్చు.. సినిమా చాలా బాగుంది కదా! ఎందుకు ఎంపిక చేయలేదు? అని. ఇక్కడ ఆస్కార్ అవార్డులకు ఏ ప్రాతిపదికన సినిమాలు ఎంపిక చేస్తారనే విషయం చాలా గోప్యంగా ఉంచుతారని గుర్తుంచుకోవాలి.
ఆ విషయం ఏంటనేది కనీసం సినిమాను నిర్మించిన నిర్మాతలకు కూడా తెలియదట. మరి ఏయే అంశాలున్న సినిమాలను ఆస్కార్ కి నామినేట్ చేస్తారు? అనంటే.. ఇది కూడా పూర్తి సమాధానం లేని ప్రశ్నే. కానీ.. సామాజిక నేపథ్యం, మానవ సంబంధాలు, భారతీయ జీవన విధానాలు, విలువలు లాంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. కామెడీ, హారర్, లవ్ జానర్ సినిమాలకు స్కోప్ తక్కువే. వయోలెన్స్ ఉన్న జల్లికట్టు గతేడాది ఎంపికైంది కదా! అంటే.. అసలు ఏ జానర్ అనేది పట్టించుకోరు. ఫలానా టైప్ సినిమాలే అవుతాయని కూడా చెప్పలేం. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. కమర్షియల్ గా పెద్ద హిట్టు, నెట్ ఫ్లిక్స్ లో ఇన్ని వారాలు ట్రెండింగ్ అయ్యింది, ఇండియాతో పాటు విదేశీయులు సినిమాను సపోర్ట్ చేశారు.. ఇలాంటివి ఆస్కార్ పరిథిలోకి అసలు రావు.
ఆస్కార్ లో నామినేట్ అవ్వాలంటే.. ముఖ్యమైన అంశాలు కంటెంట్ పరంగా ఎంచుకున్న నేపథ్యం, ఆ నేపథ్యానికి తగిన సంస్కృతి, విలువలు ఇలా అన్ని పరిథిలోకి వస్తాయి. వీటన్నింటికి మించి గొప్ప కథ. ఆర్ఆర్ఆర్.. మూవీలో అన్నీ ఉన్నాయి కదా! అనిపించవచ్చు. కానీ.. ఆర్ఆర్ఆర్ చిత్రం.. ఓ పీరియాడిక్ నేపథ్యానికి ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ ని జోడించి.. విజువల్ గా అద్భుతం సృష్టించింది. అంతే.. అలాగని గొప్ప సినిమా కాకుండా పోదు. ఇండియా పేరును వరల్డ్ వైడ్ మరిన్ని ఎక్కువ దేశాలకు విస్తరించిన మంచి సినిమాగా ఎప్పుడూ ఆర్ఆర్ఆర్ పేరు అలా ఉండిపోతుంది. ఇప్పటివరకు ఇండియా నుండి మదర్ ఇండియా(1957), సలాం బాంబే(1988), లగాన్(2002) చిత్రాలు మాత్రమే ఆస్కార్ ఫైనల్ లిస్ట్ వరకు చేరుకున్నాయి.
మనదేశం నుండి ఏదైనా సినిమా ఆస్కార్ కి వెళ్ళాక చాలా తతంగం ఉంటుంది. మన సినిమాను అక్కడి క్రిటిక్స్, ఆస్కార్ కమిటీ చూడాలి. వారికీ గొప్ప సినిమా అనిపించాలి. ఓటింగ్ లో వేరే దేశాల సినిమాలకంటే ఎక్కువ ఓట్లు రావాలి. అందుకు భారీ ప్రచారం కూడా అవసరం అవుతుంది. మన దేశ ప్రభుత్వం అందుకు ఓ 50 లక్షలు ఇస్తుంది.. కానీ, మిగతా అమౌంట్ నిర్మాత భరించగలడా? అనేది కూడా పరిగణలోకి వస్తుంది. ఆస్కార్ అనేది వెస్ట్ కంట్రీస్(పశ్చిమ దేశాలు) కోసం పెట్టుకున్న అవార్డులు. విదేశీ చిత్రాల కోసం ఒకే కేటగిరీ ఉంటుంది.. అదే బెస్ట్ ఇంటెర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీ. అందులో మాత్రమే మన సినిమాలు పోటీకి దిగుతాయి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆస్కార్ రానంత మాత్రాన ఇండియన్ యాక్టర్స్ నటన ఆస్కార్ విన్నర్స్ కంటే తక్కువ కాదు.. ఇండియన్ సినిమాలు ఆస్కార్ సినిమాలకన్నా తక్కువ కాదు. ఎవరి పరిధిలో వారి సినిమాలు ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నాయి. ఆ విషయంలో ఇండియన్ సినిమాలు.. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి సినిమాలు అలాంటి ఎల్లలను చెరిపేశాయి. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రానంత మాత్రాన ఆ సినిమా వెనుక చిత్రబృందం కృషి తక్కువగా ఉందని అనగలమా? గుర్తింపు వేరే. ప్రతిభ వేరే. అలాగని గుర్తింపు వచ్చినంత మాత్రాన ప్రతిభ లేదని కాదు.. ప్రతిభకు ఖచ్చితంగా గుర్తింపు రావాలని లేదు. ఈ అవార్డులు కూడా అంతే! ఓ సినిమా విషయంలో.. ఆదరణకు మించిన అవార్డు ఇంకేముంది చెప్పండి!