టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఎనర్జీ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది అఖండ సినిమాతో ‘ఆల్ టైం బ్లాక్ బస్టర్’ని ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ఈ ఏడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. బాలయ్య సినిమా అంటేనే మాస్ ఆడియెన్స్ లో పూనకాలు పుట్టేస్తాయి. అంతలా మాస్ లో ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు. అయితే.. బాలయ్య డైలాగ్స్, డాన్స్ తో పండగ చేసుకునే ఫ్యాన్స్ ని.. సినిమాలలోనే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆహా ఓటిటిలో ‘ అన్ స్టాపబుల్’ అనే సెలెబ్రిటీ టాక్ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
‘అన్ స్టాపబుల్’ మొదటి సీజన్ లో కొందరు స్టార్ హీరోలు, సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. మహేష్ బాబు, మోహన్ బాబు, అనిల్ రావిపూడి, అఖండ టీమ్, పుష్ప టీమ్, నాని ఇలా చాలామంది బాలయ్యతో ముచ్చటించి మంచి వినోదాన్ని అందించారు. అయితే.. షోని హోస్ట్ చేయడమనేది బాలయ్యకు కొత్తే.. అయినప్పటికీ తనదైన శైలిలో ఉత్సాహంగా సీజన్ ని నడిపించాడు. అలాగే దేశంలోనే బెస్ట్ ఓటిటి టాక్ షోలలో ‘అన్ స్టాపబుల్’ ఒకటిగా రికార్డు స్థాయి రేటింగ్ సాధించింది. దీంతో బాలయ్యతో సెకండ్ సీజన్ కూడా కావాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడం, ఆహా వారు అంగీకరించడం అన్నీ చకచకా అయిపోయి త్వరలో ‘అన్ స్టాపబుల్ 2’ ప్రారంభం కాబోతుంది.
ఈ నేపథ్యంలో షో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పటికే పలు కథనాలు వినిపిస్తున్నాయి. అదీగాక ఆహా కూడా త్వరలోనే అంటూ ప్రేక్షకులను ఊరిస్తోంది. అయితే.. ఈసారి సీజన్ బాలయ్య హోస్టింగ్ లో మెగాస్టార్ చిరంజీవి మొదటి గెస్ట్ గా రాబోతున్నాడని టాక్ నడుస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు గానీ, షోలో ఇద్దరు లెజెండ్స్ కనిపిస్తే ఫ్యాన్స్ లో కలిగే ఆనందం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఇక గతేడాది అన్ స్టాపబుల్ దసరా ఫెస్టివల్ మూమెంట్ లో మొదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్ కూడా దసరా మూమెంట్ లోనే ప్రారంభిస్తే బాగుంటుందని బాలయ్య, నిర్వాహకులు భావిస్తున్నారట. చూడాలి మోస్ట్ అవైటింగ్ షో నుండి అధికారిక ప్రకటన ఎప్పుడు రానుందో. మరి అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.