Rana: టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన డి. సురేష్ బాబు తనయుడు, హీరో రానా భూవివాదం కేసులో సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా వీరికి సంబంధించి ఓ భూవివాదం కేసు నడుస్తోంది. మరి ఇంతకీ ఆ వివాదం ఏంటనే వివరాల్లోకి వెళ్తే.. దగ్గుబాటి సురేష్ బాబుకి ఫిలింనగర్ లో 2200 గజాల స్థలం ఉంది. గతంలో నటి మాధవీలత నుండి దగ్గుబాటి ఫ్యామిలీ ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, సురేష్ బాబు, హీరో వెంకటేష్ ల పేర్లపై రిజస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక 2014లో ఈ స్థలాన్ని హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారికి అగ్రిమెంట్ ప్రకారం లీజుకు ఇచ్చారట దగ్గుబాటి ఫ్యామిలీ. ఈ క్రమంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి లీజు అగ్రిమెంట్ రెన్యూవల్ చేస్తూ వస్తున్నారట. ప్రస్తుతం ఆ స్థలం ఇంకా లీజు అగ్రిమెంటులోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఆ స్థలంలోని 1000 గజాలను హీరో దగ్గుబాటి రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. లీజు కొనసాగుతుండగానే అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేశారట.
అగ్రిమెంట్ గడువు ముగియకముందే తన వ్యాపారానికి భంగం కలిగించి, ఆర్థికంగా నష్టాన్ని కలిగించారని సదరు వ్యాపారి సిటీ సివిల్ కోర్టులో సురేష్ బాబు, వెంకటేష్, రానాలపై పిటిషన్ దాఖలు చేశారు. కేసు కోర్టులో ఉండగానే సురేష్ బాబు తన కొడుకు రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు న్యాయస్థానం దృష్టికి రావటంతో కోర్టు వారికి నోటీసులు జారీచేసిందని సమాచారం. దీంతో ఈ కేసు విషయమై రానా సిటీ సివిల్ కోర్టుకి హాజరయ్యారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.