హీరో.. ఈ మాట అనిపించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. మనల్ని అభిమానించే నలుగురు మనుషులను సంపాదించుకోవడమే కష్టమైన ఈరోజుల్లో.. లక్షల మంది ఫ్యాన్స్ ఉండటం నిజంగా అదృష్టం కాక మరేంటి? ఇలాంటి క్రేజ్ కోసం చాలా మంది హీరోలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. వీరిలో సక్సెస్ అయ్యేది మాత్రం కేవలం 10 శాతం మందే. అయితే.. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, రేంజ్ వచ్చాక మాత్రం వాటిని కాపాడుకోవడం చాలా కష్టం. ఇందుకోసం చాలా హుందాగా నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రేక్షకుల నమ్మకాన్ని ఎప్పటికప్పుడు సంపాదించుకుంటూ ముందుకి పోవాల్సి ఉంటుంది. కానీ.. ఈ విషయంలో సుడిగాలి సుధీర్ తన స్థాయికి తగట్టు నడుచుకోవడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
మిగతా వారితో పోలిస్తే సుడిగాలి సుధీర్ ది ఓ డిఫరెంట్ స్టోరీ. కింద స్థాయి నుండి కష్టపడి ఎదిగి, జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి, కమెడియన్ అన్న ట్యాగ్ తగిలించుకుని, తన మీద పంచ్ లు వేపించుకుని ఎదిగాడు సుధీర్. సామాన్యంగా ఇలాంటి ఓ ఆర్టిస్ట్ కు ఫ్యాన్ బేస్ రావడం కష్టం. అది కూడా హీరోలకి సమానంగా క్రేజ్ రావడం దాదాపు అసాధ్యం. కానీ.. సుధీర్ తన టాలెంట్ తో.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే సో కాల్డ్ హీరోల కన్నా.. సుధీర్ రేంజ్ ఏ మాత్రం తక్కువ కాదు. సుధీర్ కు ఏకంగా బుల్లితెర మెగాస్టార్ అన్న ట్యాగ్ తగిలించేశారు అంటే సుధీర్ ను వాళ్లంతా ఎంతలా అభిమానిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. కానీ.. సుధీర్ ఇప్పుడు ఆ స్థాయిని కాపాడుకోకపోవడంతోనే ఫ్యాన్స్ అతని వ్యవహారశైలిపై మండి పడుతున్నారు.బుల్లితెరపై సుధీర్ కు ఇప్పటివరకు ఎన్నిసార్లు పెళ్లి జరిగిందో లెక్కే లేదు. రష్మీ నుండి విష్ణు ప్రియ వరకు అంతా సుధీర్ తో పాటు పెళ్లి పీటలు ఎక్కినవారే. అన్నీ ఆయా షోల రేటింగ్స్ పెంచడం కోసం వేసిన వేషాలే. సుధీర్ ఓ ఆర్టిస్ట్ గా ఇలాంటివి చేయడంలో తప్పు లేదు. కానీ.. అందుకు ఓ లిమిట్ ఉండాలి కదా అన్నదే ఫ్యాన్స్ వాదన! నిజానికి.. సుధీర్ పెళ్లి విషయంలో ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందేమో అని అతని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తూ వస్తున్నారు. వారి అభిమానాన్ని, ఎదురుచూపులను క్యాష్ చేసుకుంటూ.. సుధీర్ సీజన్.. సీజన్ కు ఓ అమ్మాయితో ఫేక్ పెళ్లి చేసుకుని తన షోల రేటింగ్స్ పెంచుకోవడం ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజాగా “శ్రీ దేవి డ్రామా కంపెనీ” షో కోసం తేజస్వీ నాయుడుతో మళ్ళీ సుధీర్ కు ఎంగేజ్మెంట్ చేయించారు. తేజస్వీ నాయుడు గ్లామర్ ఫీల్డ్ కు సంబంధం లేని అమ్మాయి ఏమి కాదు. ఈమె ఒక మోడల్. చూడగానే ఆకట్టుకునే చిరునవ్వుతో.. ప్రేక్షకులను ఆకర్షించే రూపం ఆమె సొంతం. ఇక ఇప్పటికే తేజస్వీ పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది. రీసెంట్ గా ఆహాలో వచ్చిన సామజవరగమన అనే సిరీస్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఆమెని సుధీర్ పక్కన చేర్చి.. ఆ పాపులారిటిని ఉపయోగించుకోవాలి అనుకున్న సదురు టీవీ యాజమాన్యం.. తనతో ఓ షోని ఇలా ప్లాన్ చేశారంటున్నారు నెటిజన్స్.ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న తేజస్వీ ఇలాంటివి చేసింది అంటే.. ఒక అర్ధం ఉంది. కానీ.. ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న సుధీర్ ఇలాంటి ఫేక్ వీడియోస్ లో నటిస్తూ.. తన అభిమానుల మనోభవాలను దెబ్బతీయడం ఎందుకు అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇప్పుడు సుధీర్ ఫ్యాన్స్ బాధ కూడా ఇదే. ఒకవేళ వీరి బంధం నిజమైనా.. సుధీర్ స్థాయి వ్యక్తి.. ఇలా ఒక షోలో తన ప్రియురాలిని పరిచయం చేయాల్సిన అవసరం ఏమిటి అని ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
నిజానికి సుడిగాలి సుధీర్ అంటే ద్వేషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చిన సుధీర్ అంటే అందరికీ ఇష్టమే. కానీ.. ఫ్యాన్స్ ఫీలింగ్స్ పట్టించుకోకుండా, ఇలా టి.ఆర్.పి రేటింగ్స్ కోసం.. సుధీర్ తన స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం ఏమిటి అన్నదే అందరి బాధ! మరి.. ఇకనైనా సుడిగాలి సుధీర్ ఇలాంటి విషయాలలో జాగ్రత్త పడతాడో, లేదో చూడాలి. మరి.. సుధీర్ ఇలాంటి పెళ్లి వీడియోస్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.