Ambika Rao: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పాపులర్ పంజాబీ కమెడియన్ సురిందర్ శర్మ మరణవార్తను మరిచేలోపే సినీ అభిమానులకు మరో చేదువార్త ఎదురైంది. ప్రముఖ నటి, అసిస్టెంట్ డైరెక్టర్ అంబికా రావు సోమవారం(జూన్ 27న) గుండెపోటుతో కన్నుమూశారు. 58 ఏళ్ళ వయసు కలిగిన నటి.. ఎర్నాకులంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
పాపులర్ మలయాళం మూవీ ‘కుంబళంగి నైట్స్’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబికా రావు.. 2002లో బాలచంద్ర మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణ గోపాలకృష్ణ’తో సహాయ దర్శకురాలిగా సినీ కెరీర్ ప్రారంభించారు. అప్పటి నుండి దాదాపు రెండు దశాబ్దాలపాటు అంబికా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు.
స్టార్ హీరో మమ్ముట్టి నటించిన ‘రాజమాణిక్యం’, ‘తొమ్మనుమ్ మక్కలుమ్’ సినిమాలతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘వెళ్లినక్షత్రం’ సినిమాకు సహాయ దర్శకురాలిగా అంబికా పనిచేశారు. అనంతరం.. దిలీప్ నటించిన బ్లాక్ బస్టర్ ‘మీషా మాధవన్’, ‘సాల్ట్ అండ్ పెప్పర్’, ఇటీవల విడుదలైన ‘అనురాగ కరికిన్ వెల్లం’, ‘థమాషా’, ‘వెల్లం’ వంటి అనేక సినిమాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం అంబికా మృతిపట్ల దిగ్భ్రాంతికి గురైన సినీప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
Gone too soon. #AmbikaRao, known for her mother character in Kumbalangi Nights. pic.twitter.com/aaBFbR434A
— veee (@sonder_being) June 27, 2022