రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతితో ఆయన కుటుంబంలోనే కాక.. ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన చనిపోయారనే వార్త తెలియగానే సినీ, రాయకీయ ప్రముఖులు కృష్ణంరాజు నివాసానికి చేరుకుని నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. తొలుత ఆదివారం మధ్యాహ్నం వరకు కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆయనకున్న అశేష అభిమానులను దృష్టిలో పెట్టుకుని.. అంత్యక్రియలను సోమవారానికి వాయిదా వేశారు. ఇక తొలుత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించినా.. చివరకు ఆయనకు ఎంతో ఇష్టమైన ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక మొయినాబాద్ సమీపంలోని కనక మామిడిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు కృష్ణంరాజు పార్థీవదేహం అంతిమయాత్ర ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఓ కారణం ఉంది అంటున్నారు కృష్ణంరాజు సన్నిహితులు.
కృష్ణంరాజు ఐదేళ్ల క్రితం కనకమామిడిలో ఈ వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ నివాసం ఉండటం కోసం.. ఆయన అభిరుచి మేరకు ఓ ఫామ్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు అది పూర్తి కాక ముందే ఆయన కన్నుమూశారు. ఆయన ఎంతో ఇష్టంగా నిర్మాణం ప్రారంభించిన ఫామ్ హౌస్‌లో ఉండే అవకాశం లేకుండా పోయింది. కనీసం అంత్యక్రియలైనా అక్కడ నిర్వహిస్తే.. మంచిదనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక సోమవారం మధ్యాహ్నం కనకమామిడిలోని ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇక కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు కాగా.. వారిలో ఒకరు ప్రసుత్తం విదేశాల్లో ఉంటున్నారు. ఆమె ఇండియాకి రావాల్సి ఉండటంతో.. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కృష్ణంరాజు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రభాస్‌కు ఫోన్ చేసి పరామర్శించినట్లు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.