గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రెండేళ్ల నుంచి కరోనా కాటుకు సినీ, రాజకీయ నేతలే కాదు.. ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూశారు. తాజాగా కరోనా మహమ్మారికి మరో దర్శకుడు కన్నుమూశాడు. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ నటించిన ‘కిచ్చ’, కేజీఎఫ్ ఫేమ్ యశ్ నటించిన ‘కిరాతక’లను తెరకెక్కించిన దర్శకుడు ప్రదీప్ రాజ్ (46) మహమ్మారి బారిన పడి ఇవాళ మరణించారు. ఈ మద్య ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పదిహేనేళ్లుగా ఆయన డయాబెటీస్ బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గురువారం తెల్లవారు జామున 3 గంటలకు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కన్నుమూశారు. దర్శకుడు ప్రదీప్ రాజ్ కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పుదుచ్చేరిలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన సోదరుడు ప్రశాంత్ రాజ్ తెలిపారు. ప్రదీప్ రాజ్ మరణ వార్త విన్న కన్నడ ఇండస్ట్రీ ఒక్కసారే షాక్ కి గురైంది. సినీ ప్రముఖులు, పలువురు నెటిజన్లు సంతాపాలు తెలియజేశారు. ట్విట్టర్ లో ఆయన సినిమాలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.
ప్రదీప్ రాజ్.. కిచ్చ, కిరాతకతో పాటు రజనీ కాంత, అంజాద గండు, మిస్టర్ 420 వంటి సినిమాలనూ ప్రదీప్ రాజ్ తెరకెక్కించారు. రజనీకాంతకు ఆయన స్క్రీన్ ప్లే కూడా రాశారు. అంతే కాదు ‘కిరాతక 2’ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్న సమయంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.