Sonu Sood: హిందీ భాషపై ట్విటర్ వేదికగా కొనసాగిన అజయ్ దేవ్‌గణ్ వర్సెస్ కిచ్చ సుదీప్ వార్‌కు తెరపడింది. ‘‘ హిందీ రాష్ట్ర భాష కాదు’’ అని అనటంలో తన అర్థం వేరని కిచ్చ సుదీప్ వివరణ ఇవ్వటంతో గొడవ పెద్దది కాకుండా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో రియల్ హీరో సోనూసూద్ హిందీ భాష వివాదంపై స్పందించారు. తన అభిప్రాయాన్ని అందంగా చెప్పి అందరి మనసును గెలుచుకున్నారు. గురువారం ఆయన ఓ నేషనల్ మీడియాతో హిందీ భాష వివాదంపై మాట్లాడుతూ.. ‘‘ హిందీ మాత్రమే జాతీయ భాషని నేను అనుకోవట్లేదు. ఇండియా మొత్తానికి ఓ భాష ఉంది. అది ఎంటర్‌టైన్‌మెంట్. మీరు ఏ ఇండస్ట్రీనుంచి వచ్చారన్న దాంతో సంబంధం లేదు.
మీరు ప్రజల్ని ఎంటర్‌టైన్ చేస్తే.. వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తారు.. గౌరవిస్తారు.. తమవారిగా అంగీకరిస్తారు. సౌత్ సినిమాలు సక్సెస్ అవ్వటం కారణంగా హిందీ సినిమాలు తీయటంలో మార్పు వస్తుంది. సినిమాలు తీసేవాళ్లు ప్రజల నాడిని అర్థం చేసుకోవాలి. జనం కేవలం మనసు పెట్టి సినిమాలు చూసే రోజులు పోయాయి. మనసుతో పాటు బుర్రలు కూడా ఉపయోగించి సినిమాలు చూస్తున్నారు. చెత్త సినిమాల కోసం వందల రూపాయలు ఖర్చుపెట్టడం అవసరమా అనుకుంటున్నారు. కేవలం మంచి సినిమాను మాత్రమే ఆదరిస్తున్నారు’’ అని అన్నారు.
కాగా, కొద్దిరోజుల క్రితం ‘‘విక్రాంత్ రోణ’’ సినిమా ప్రమోషన్‌లో కిచ్చ సుదీప్ మాట్లాడుతూ.. ‘‘ ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు’’ అని అన్నారు. దీనిపై ట్విటర్ వేదికగా అజయ్ దేవగణ్ కొంచెం సీరియస్‌గానే స్పందించారు.. “హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’’ అని పేర్కొన్నారు. అజయ్ ట్వీట్‌పై సుదీప్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ‘హలో అజయ్ సార్. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.
మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు దీనిపై మీకు వివరణ ఇస్తాను. భారతదేశంలోని అన్ని భాషలపై నాకు గౌరవం ఉంది. మిమ్మల్ని బాధపెట్టడానికో, రెచ్చగొట్టడానికో.. ఇలా చేయలేదు. నేను ఈ టాపిక్‌ను ఇక్కడితో ఆపేయాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అజయ్ తన ట్వీట్ ద్వారా.. ‘‘ దీనిపై క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. నేను ఎప్పుడూ సినిమా పరిశ్రమను ఒక్కటిగానే భావిస్తాను. మేము అన్ని భాషలను గౌరవిస్తాము అలానే ప్రతి ఒక్కరూ హిందీ భాషను కూడా గౌరవించాలని మేము ఆశిస్తున్నాము.. దన్యవాదాలు’’ అని అన్నారు. మరి, సోనూసూద్ అద్భుతమైన స్పందనపై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ డైలాగ్ లీక్ చేసిన హరీష్ శంకర్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.