మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే తెలుగు ఫ్యాన్స్ ఎలా ఉర్రూతలూగిపోతారో చెప్పక్కర్లేదు. ఆయన సినిమా అనౌన్స్ మెంట్ అయినా, రిలీజైనా మెగా అభిమానులకు పండగే. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మెగాస్టార్.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘మెగా154’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ‘మెగా154’ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం.. చాలా కొత్తగా ఉంటుందని చెప్పి ఇటీవలే మెగాస్టార్ అంచనాలు పెంచేశారు.
ఇక ఎట్టకేలకు మెగా154 టైటిల్ కోసం అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడింది. దీపావళి కానుకగా మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే మాస్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ మెగా టీజర్ లో చిరంజీవి చేతికి ఉంగరాలు, గళ్ళలుంగీ, మెడలో గొలుసు.. చేతిలో బీడీ.. ఇలా ఫ్యాన్స్ కోరుకునే అన్ని మాస్ అంశాలతో మాస్ లుక్ డిజైన్ చేశాడు దర్శకుడు. మొత్తానికి మెగా టైటిల్ ని ‘వాల్తేరు వీరయ్య’ అని అనౌన్స్ చేశారు. అయితే.. టీజర్ ని రెండు నిమిషాలకు పైగా ప్లాన్ చేయడం విశేషం. అలాగే మెగాస్టార్ నుండి.. ‘ఇలాంటి ధమాకాలు మరిన్ని చూడాలంటే లైక్, షేర్, సబ్ స్క్రైబ్ చేయండి’ అని డైలాగ్ చెప్పి.. స్టయిలిష్ గా నాటు బీడీ వెలిగించడం మాస్ ట్రీట్ అనే చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్.. ప్రస్తుతం ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది.