కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న మాటకి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. అతి సాధారణ కుటుంబంలో జన్మించి స్వయంకృషితో ఒక మహా వృక్షంగా ఎదిగిన ఘనత చిరంజీవిది. “నీ బతుక్కి హీరో అవుతావా? మొఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా” అని ఎదుర్కున్న అవమానం నుంచి “అన్నయ్య ముఖం చూడకపోతే పొద్దు పొడవదు” అనేంతగా సంపాదించుకున్న అభిమానం వరకూ చిరుది ఒక మహా ప్రస్థానం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. కింద పడ్డారు, పడి లేచారు. ఎవరెస్ట్ శిఖరంలా అందనంత ఎత్తుకి ఎదిగారు. రవితేజ నుంచి కార్తికేయ వరకూ ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి రావడానికి కారణం అయ్యారు. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు ఒక లెజండరీ యాక్టర్‌గా ఎదిగారు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండడం, ఎవరెన్ని మాటలు అన్నా చిరునవ్వుతో స్వాగతించడం, తిట్టిన వారిపై పగ పెంచుకోకపోగా.. తిరిగి వారిని ప్రేమించడం.. అసూయ, అహం వంటి పదాలకి చోటు లేకపోవడం ఇవన్నీ మెగాస్టార్‌ని ఆ స్థానంలో కూర్చోబెట్టాయి.
నటనతో, డ్యాన్సులతో, ఫైట్లతో తెలుగు తెర మీద ఒక కొత్త చరిత్రను రాసిన చిరంజీవి కేవలం స్టార్‌గా ఉండిపోలేదు. తరలిరాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అన్నట్టు ఆయనే వెతుక్కుంటూ సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఒక్కో మెట్టు దిగుతూ వచ్చారు. మెగాస్టార్‌గా ఆకాశంలోనే కాదు, మనసున్న మారాజుగా అభిమానుల గుండెల్లో కొలువైయున్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అలాంటివి. సేవే లక్ష్యం, ప్రేమే మార్గం అని నమ్మే సిద్ధాంతం చిరంజీవిది. సాయం కోసం వస్తే కాదనకుండా చేయడం, ప్రేమని పంచుకుంటూ పోవడం ఆయన నైజం. చిరు తన జీవితంలో ఎంతో మందికి సాయం చేశారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన సమాజం కోసం తన వంతు సాయంగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఇందులో యువకులని భాగస్వామ్యం చేయాలనుకున్నారు. యువకులలో చైతన్యం తీసుకురావాలని అనుకున్నారు.
అలా అనుకుని ప్రారంభించినవే చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లు, ఐ బ్యాంక్‌లు. నేత్రదానం చేయండి, రక్తదానం చేయండి అని యువకులని చైతన్యపరిచిన రియల్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఫ్యాన్స్ అంటే పెద్ద పెద్ద కటౌట్‌లు కట్టి, పాలాభిషేకాలు చేయడం లాంటివి కాకుండా.. అభిమాన హీరో పేరు మీద సమాజం కోసం సేవ చేయడం కూడా అని నిరూపించిన రియల్ హీరో మెగాస్టార్. ఇండస్ట్రీలో ఫ్యాన్స్‌ని రియల్ హీరోలుగా తీర్చిదిద్దిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి పుట్టినరోజు వస్తుందంటే చాలు.. ఏటా భారీగా అభిమానులు రక్తదానం చేస్తుంటారు. చిరంజీవి పుట్టినరోజుని సమాజ సేవ కోసం అంకితమిచ్చి ఒక పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతలా వారిని సమాజం గురించి ఆలోచించేంతగా ప్రేరేపించిన రియల్ హీరో చిరంజీవి.
నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికుల ఆకలి కేకలు విని చలించిపోయారు. సినీ కార్మికులకు పెద్ద దిక్కుగా నిలిచారు. రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమంది కళాకారులను ఆదుకున్నారు. ‘కరోనా క్రైసిస్ చారిటీ’ ఏర్పాటుచేసి ఉచితంగా వ్యాక్సినేషన్లు వేయించారు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించారు. ఇలా ఎప్పుడు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ వాలిపోతారు. అది ఇండస్ట్రీ సమస్య అయినా, సొసైటీ సమస్య అయినా ఇంకేదైనా సరే పెద్ద దిక్కుగా ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తారు. తాజాగా ఆయన సినీ కార్మికుల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా ఒక మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. చిత్రపురి కాలనీలో ఒక హాస్పిటల్ నిర్మించాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఈ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఇన్ని బాధ్యతలు భుజాన మోస్తూ కూడా ఇండస్ట్రీ పెద్దని కాదనడం నీ వ్యక్తిత్వానికి నిదర్శనం. బాధ్యత అనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు, తీసుకుంటే వచ్చేదని.. ఎవరో మోపితే వచ్చేది కాదు, స్వయంగా అనుకుని మోస్తే వచ్చేది అని నిరూపించావు కదన్నయ్య. నీకు కష్టమొస్తే ఆ హలహలాన్ని కంఠంలో దాచుకున్న శంకరుడిలా లోపల దాచేసుకుంటావు, బయటకి మాత్రం చిరునవ్వుతో కనబడతావు. అదే ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే మాత్రం కన్నీళ్ళు పెట్టుకుంటావు. ఇండస్ట్రీ కష్టాలన్నీ నీవే అంటావు, కానీ ఇండస్ట్రీ పెద్ద అంటే మాత్రం ఒప్పుకోవు. నిన్ను ఇండస్ట్రీని ఏలే మహారాజువని అందరూ అనుకుంటుంటే.. నువ్వు మాత్రం ఇండస్ట్రీలో ఒక సగటు మనిషినని అంటున్నావు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు నువ్వే అని అందరూ అనుకుంటుంటే.. నాకు ఇండస్ట్రీనే దిక్కు అని అంటున్నావు. ఇంత సింప్లిసిటీ ఎలా అన్నయ్య నీకు సాధ్యం? ఒక మహా వృక్షానివయ్యా నువ్వు. నీ నీడలో ఎంతో మంది బతుకుతున్నారు. పొగడ్తలకు పడిపోవు, తిట్లకి కుంగిపోవు. నలుదిక్కులా వ్యాపించిన నీ ఖ్యాతి గురించి ఎంత చెప్పినా తక్కువే. నీ మంచి మనసుకి సెల్యూట్ అన్నయ్య.