'బలగం' నటుడు మురళీధర్ గౌడ్ ఎమోషనల్ అయ్యారు. తన లైఫ్ లోని కన్నీటి కష్టాలు చెబుతూ ఏడ్చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమాల్లో యాక్టర్ అనగానే.. అబ్బో వాళ్లు లగ్జరీగా బతుకుతారు, అదీ ఇదీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. స్టార్ హీరోహీరోయిన్స్ వరకు ఓకే గానీ చిన్న చిన్న ఆర్టిస్టుల్లో చాలామంది రోజూ గడవడం కోసం కష్టపడుతూనే ఉంటారు. కొందరికీ పేరు, ఫేమ్ వచ్చినా సరే ఆర్థికంగా స్థిరపడటానికి కాస్త టైమ్ పడుతుంది. సినిమాల్లో కాదు గానీ తన లైఫ్ లో ఎన్ని కష్టాలు పడ్డానో చెబుతూ ‘బలగం’ నటుడు మురళీధర్ గౌడ్ ఎమోషనల్ అయ్యారు. 10 రూపాయలు కూడా లేని రోజులు ఉన్నాయని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఇంటర్వ్యూ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మురళీధర్ గౌడ్ ఎలక్ట్రీషియన్ బోర్డ్ లో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. నటన పట్ల ఆసక్తితో ఈ వయసులో సినిమాల్లోకి వచ్చారు. ‘డీజే టిల్లు’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈయన.. ‘బలగం’తో మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. నల్లి బొక్క కోసం పంతానికి పోయి.. అత్తారింటితో పూర్తిగా సంబంధాలు తెంచేసుకున్న అల్లుడి పాత్రలో జీవించేశారు. సినిమా హిట్ కావడంతో ఈయనని పలువురు ఇంటర్వ్యూ చేశారు. తాజాగా అలా ఓ దానిలో మాట్లాడుతూ.. తను కుటుంబ కష్టాల్ని, జాబ్ చేస్తున్నప్పుడు ఉన్న పరిస్థితుల్ని వివరించారు.
‘నేను పుట్టింది మెదక్ జిల్లాలోని రామాయంపేట. సిద్ధిపేట్ లో చదివాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో దాదాపు 27 ఏళ్లపాటు పనిచేసి రిటైర్ అయ్యాను. మేం నలుగురు అన్నదమ్ములం ఓ చెల్లి. డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా ఇంట్లో రూ.10 కూడా ఉండేవి కావు. మా కోసం అమ్మనాన్న చాలా కష్టాలు పడ్డారు. నేను కళ్లారా వాటిని చూశాను. ఓసారి పది రూపాయలు అవసరమైతే.. మా బంధువుల్లో రిచ్ గా ఉండే ఒకరి ఇంటికి వెళ్లి అప్పు తీసుకుని రమ్మని అమ్మ చెప్పింది. భయపడుతూనే వెళ్లి అడిగాను. ఇలా చాలాసార్లు జరిగింది. నాన్న చాలాదూరంగా పనిచేశారు. ఆయన ఇంటికి రాగానే 10 రూపాయలు తీసుకుని వాళ్లకు తిరిగిచ్చేసేవాడిని. అప్పట్లో చిరిగిపోయిన బట్టలు కూడా వేసుకున్నాను. దీంతో అందరూ నన్ను ఎగతాళి చేస్తూ దారుణంగా అవమానించేవారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. రిటైర్మెంట్ అయినప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో’ అని మురళీధర్ గౌడ్.. తన లైఫ్ లోని కష్టాల్ని చెప్పుకొచ్చారు. మరి ఈయన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.