తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. మొదటి నుంచి తనదైన మేనరీజం.. స్టైల్, డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ దేశ వ్యాప్తంగా దుమ్ములేపింది. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘పుష్ప’ బాక్సాఫీస్ షేక్ చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అల్లు అర్జున్ కి తెలుగు లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. కేరళాలో అల్లు అర్జున్ ని ఫ్యాన్స్ ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ అయిన ‘పుష్ప’ వరకు ప్రతి మూవీ అక్కడి థియేటర్లలో సందడి చేశాయి.
అల్లు అర్జున్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా తన మంచి మనసు చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కష్టకాలంలో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించారు. తన ఫ్యాన్స్ కి ఏ చిన్న కష్టం వచ్చినా స్వయంగా వెళ్లి మరీ సహాయం చేస్తుంటారు. కరోనా సమయంలో కూడా అల్లు అర్జున్ ఎంతోమందిని ఆదుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మన రాష్ట్రం కాకపోయినా చదువు విలువ తెలిసిన వ్యక్తిగా కేరళాలో ఓ నర్సింగ్ విద్యార్థిని చదువుకు అయ్యే ఖర్చు భరించడమే కాదు.. ఆమెను దత్తత తీసుకున్నాడు.
ఆ మద్య కేరళాలో భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో ఎన్నో గ్రామాలు కొట్టుకొని పోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.. ముఖ్యంగా అలెప్పీ అనే ప్రాంతం పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ తర్వాత కోవిడ్ కష్టాలతో ఎంతో మంది తమ కుటుంబ పెద్దలను కోల్పోయి అనాధలుగా మిగిలారు. కోవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థిని నర్సింగ్ చేయడానికి డబ్బు కావాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కృష్ణ తేజ ‘వీ ఆర్ ఫర్ అలెప్పీ’ద్వారా ఆమెకు సహాయాన్ని అందించాలని భావించారు.
ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఆ విద్యార్థినికి ఒక సంవత్సరం ఫీజు చెల్లిస్తే బాగుంటుందని కోరారు.. కలెక్టర్ కృష్ణతేజ. ఆ విద్యార్థిని పరిస్థితి గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ ఒక సంవత్సరం కాదు.. నాలుగు సంవత్సరాలు తనకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని.. ఆమెను తాను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు మాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఆ విద్యార్థిని నర్సింగ్ కోర్సు పూర్తయ్యేసరికి దాదాపు పది లక్షల ఖర్చు అవుతుందని.. రిల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్ ని ఎంతో గొప్పగా ప్రశంసించారు కలెక్టర్ కష్ణతేజ. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్ బుక్ లో షేర్ చేశారు. అల్లు అర్జున్ మంచి మనసు తెలుసుకున్న కేరళా ఫ్యాన్స్ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.