తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన ‘తునివు’ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదలైంది. తమిళనాట సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. స్పెషల్ షో సందర్భంగా పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గర హల్చల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ థియేటర్ దగ్గర అపశ్రుతి చోటుచేసుకుంది. లారీ మీదకు ఎక్కి గెంతుతున్న ఓ ఫ్యాన్ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ‘తునివు’ సినిమా స్పెషల్ షో తెల్లవారు జామున ఒంటి గంటకే పడింది. స్పెషల్ షోలో సినిమాను చూడటానికి అజిత్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గరకు చేరుకున్నారు.
భరత్ కుమార్ అనే ఫ్యాన్ చెన్నైలోని కోయంబేడ్ రోహినీ థియేటర్‌కు తన మిత్రులతో కలిసి వెళ్లాడు. థియేటర్ దగ్గర కేకలు వేస్తూ అల్లరి చేయటం మొదలుపెట్టారు. కొద్ది సేపటి తర్వాత థియేటర్ ముందున్న రోడ్డు మీదకు వచ్చారు. వీరంతా రోడ్డుపై ట్రాఫిక్‌లో మెల్లగా వెళుతున్న ఓ లారీ మీదకు ఎక్కారు. అజిత్ పేరును గట్టిగా అరుస్తూ లారీ మీద డ్యాన్స్ చేయసాగారు. లారీ మెల్లగా కదులుతూ ముందుకు వెళుతూ ఉంది. కొద్ది సేపటి తర్వాత భరత్ కుమార్ లారీ మీద నుంచి పట్టు తప్పి కింద పడ్డాడు. అతడి శరీరం బలంగా నేలను తాకింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్నేహితులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భరత్ కన్నుమూశాడు. వెన్నెముకకు బలంగా గాయం తగలటంతో అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి స్పందన వస్తోంది. భరత్ కుటుంబానికి అజిత్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా, తమిళనాట అజిత్ తునివుతో పాటు విజయ్ వారిసు సినిమా కూడా ఒకే రోజు విడుదలైంది. థియేటర్ల దగ్గర ఇద్దరి అభిమానులు గొడవలు పెట్టుకున్నారు. ప్లెక్సీలు చింపుకుని కొట్టుకున్నారు. మరి, తునివు స్పెషల్ షో సందర్భంగా చనిపోయిన భరత్‌కు మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.