విశాఖ సింగ్ ఆసుపత్రిలో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
విశాఖ సింగ్.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, తమిళ సినిమాను ఫాలో అయ్యేవారికి మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. విశాఖ సింగ్ తన సినీ ప్రయాణాన్ని తెలుగు సినిమాతోనే మొదలుపెట్టినా.. తెలుగులో మంచి అవకాశాల్ని పొందలేకపోయింది. ఆమె 2007లో వచ్చిన ‘జ్ఞాపకం’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టారు. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇక, 2008లో ఆమె ‘పిడిచ్చిరుక్కు’ అనే సినిమాతో తమిళ సినిమాకు పరిచయం అయ్యారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. అయినప్పటికి విశాఖ సింగ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
తర్వాత కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. ‘‘తురం’’ ఆమె నటించిన చివరి తెలుగు సినిమా. విశాఖ సింగ్ నటిగానే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరించారు. మొహ్రరం అనే షార్ట్ ఫిల్మ్‌కు సహనిర్మాతగా వ్యవహరించారు. అక్తం చక్తం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సినిమా అవకాశాలు తగ్గటంతో ఆమె ఇంటికే ఎక్కువ పరిమితం అవుతున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నా.. తన అభిమానులతో మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటారామె. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విశాఖ సింగ్.. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విశాఖ సింగ్ ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్న ఫొటో అది. ‘‘ నేను అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటాను. కొన్ని భయంకరమైన సంఘటనలు, ప్రమాదాలు, చలికాలంలో వస్తున్న ఆరోగ్య సమస్యలు తరచుగా వేధిస్తున్నాయి. అయినా ఓ సంతోషకరమైన ఎండాకాలం కోసం సిద్దం అవుతున్నా. ఏప్రిల్ ప్రతీసారి నాకు ఓ కొత్త సంవత్సరంలా అనిపిస్తుంది. ఎందుకంటే అదే కొత్త ఆర్థిక సంవత్సరం కాబట్టి లేదా.. అది నేను పుట్టిన సంవత్సరం అవటం వల్ల కావచ్చు. ఎండాకాలపు రోజల కోసం.. ఆరోగ్యపు దృఢసంకల్పాల కోసం ముందుకు సాగుతున్నాను’’ అని అన్నారు.