జీవితంలో చిన్న చిన్న కష్టాలకే కుంగిపోయి.. ఆత్మహత్య వంటి దారుణాలకు పాల్పడుతున్న వారి గురించి నిత్యం అనేక వార్తలు చదువుతున్నాం. మరీ దారుణం ఏంటంటే.. సోషల్ మీడియా పోస్టులకు లైక్‌లు రావడం లేదనే కారణంగా ఆత్మహత్య చేసుకున్నవారు కూడా మన సమాజంలో ఉన్నారు. అలాంటి ఘటనల గురించి చదవినప్పుడు.. విన్నప్పుడు.. అరే మరీ ఇంత చిన్న విషయాలకే.. ప్రాణాలు తీసుకోవాలా.. అసలు వీరికి జీవితం విలువ తెలుసా అనిపిస్తుంది. కష్టాలు, బాధలు, అవమానాలు వచ్చినప్పుడు కుంగిపోతే ఎలా.. వాటిని ధాటుకుని.. ధైర్యంగా నిలబడగలిగితేనే కదా.. జీవితం, బతుకు విలువ తెలేసేది. నేడు విజయ శిఖరాలను అధిరోహించిన ఎవరి జీవితాన్ని అయినా పరిశీలించండి.. ఎన్నో కష్టాలను దాటుకుని.. అవమానాలను భరించి నేడు ఈ స్థాయికి చేరుకున్నవారే ఉంటారు తప్ప.. పూలపాన్పు మీద నడిచి వచ్చిన వారు చాలా అంటే చాలా తక్కువ మంది కనిపిస్తారు.
ఇక చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య ప్రయత్నం చేసే వారు ఒక్కసారి ఈ యువతి జీవితాన్ని చూడండి. ఆమె దాటుకుని వచ్చిన కష్టాల ముందు మీ సమస్యలు ఏపాటివో పోల్చుకొండి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి.. పుట్టుకే ఓ సమస్య.. ట్రాన్స్‌జెండర్‌గా జన్మించింది.. పదేళ్ల ప్రాయంలోనే సామూహిక అత్యాచారానికి గురయ్యింది. అందరూ ఉన్నప్పటికి అనాథలా రోడ్ల వెంట భిక్షాటన చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీసింది. అయితే ఎన్ని కష్టాలు ఎదురైన చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజనర్ కోర్సు పూర్తి చేసింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని మహిళగా మారి.. అందాల పోటీల్లో సత్తా చాటుతుంది. నేడు ఆమె జీవితం ఎందరికో ఆదర్శం. ఆమె నాజ్ జోషి.. భారతదేశపు తొలి అంతర్జాతీయ ట్రాన్స్ జెండర్ బ్యూటీ క్వీన్‌గా రికార్డు సృష్టించింది. ఆమె కథ విన్న ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఆ వివరాలు..
నాజ్ స్వస్థలం ఢిల్లీ. పుట్టడం అబ్బాయిలానే పుట్టింది కానీ.. ప్రవర్తన మాత్రం ఆడపిల్లల్లా ఉండేది. దాంతో తల్లిదండ్రులు ఆమెను చీదరించుకునేవారు. తమతోపాటే ఉంటే పరువుపోతుందని భావించారు. అందుకే నాజ్‌ను పదో ఏట మేనమామకు అప్పగించారు. అతడు తన స్నేహితులతో కలసి.. ఏమాత్రం జాలి దయ లేకుండా పది సంవత్సరాల పసికందుపై సామూహిక అత్యాచారం చేశారు. తీవ్ర గాయాలతో.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నాజ్‌ను కొందరు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నాజ్‌ను గమనించిన ఓ ట్రాన్స్‌జెండర్ వ్యక్తి.. ఆమెను తనతోపాటు తీసుకెళ్లాడు.
ఇక అప్పటి నుంచి నాజ్.. ప్రతి నిమిషం బతకడం కోసం పోరాడేది. రోడ్ల వెంట భిక్షాటన, బార్లు, మసాజ్ సెంటర్లలో పని చేయడం, బ్యూటీ పార్లర్‌లో వర్క్ చేయడం.. ఏ పని దొరికితే ఆ పని చేసేది. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే.. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదవి.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత 2013లో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని పూర్తి స్థాయిలో మహిళగా మారింది. ఆ తర్వాత మోడలింగ్ ప్రారంభించింది.
ఈ క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ ట్రాన్స్‌జెండర్ సెక్స్ వర్కర్స్ ఫోటో షూట్ చేశాడు. దీనిలో పాల్గొన్న నాజ్.. ఢిల్లీ వీధుల్లో.. అమ్మాయిలా అలంకరించుకుని.. బోల్డ్ ఫొటో షూట్ చేసింది. అది కాస్త సంచలనం సృష్టించడంతో.. నాజ్‌కు పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత ఓ మ్యాగ్‌జైన్ కవర్ మీద నాజ్ ఫోటో ప్రచురించింది. ఈ ఫోటో షూట్ తర్వాత నాజ్ వెనుదిరగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. భారతదేశపు తొలి అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ బ్యూటీ క్వీన్‌గా నిలిచింది నాజ్. అంతేకాక మిస్ వరల్డ్ డైవర్సిటీ అందాల పోటీల్లో.. వరుసగా మూడు సార్లు విజేతగా నిలిచింది. ఇప్పటికే 8 సార్లు పలు అందాల పోటీల్లో కిరీటం గెలుచుకుంది.
తాజాగా.. ఎంప్రెస్ ఎర్త్ 2021-2022 కిరీటం గెలుచుకుంది నాజ్. ఆమె కథ తెలిసిన ప్రతి ఒక్కరు.. జీవితం అంటే ఇది కదా.. గెలుపంటే ఇది కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మీ జీవితం ఎందరికో ఆదర్శం.. నేటి యువతకు మీరు నిజంగా స్ఫూర్తిగా నిలుస్తారు అని కామెంట్స్ చేస్తూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి నాజ్ గురించి నెటిజనులు చేసిన కామెంట్స్ సరైనవే అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.