తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతునే ఉన్నాయి. శుక్రవారం(డిసెంబర్ 29)763 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలుబడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 1,365 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కాగా, రాష్ట్రంలో ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో గ్రూప్-1(503), గ్రూప్-2(763), గ్రూప్-4(9,168), పోలీస్ శాఖ(16614- ఎస్ఐ, కానిస్టేబుల్) ఉద్యోగాలున్నాయి. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తికాగా.. అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక గ్రూప్-4 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 28న ప్రారంభంకావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో డిసెంబర్ 30కి వాయిదా వేసింది. ఇక యూనిఫార్మ్ సర్వీస్ ఉద్యోగాల ప్రక్రియలో ఫిజికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మరోవైపు.. హార్టికల్చర్, వెటర్నరీ, విద్యుత్ శాఖల్లో కూడా కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. మొత్తంగా తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది అని చెప్పాలి. ఉద్యోగాలు సాధించడానికి నిరుద్యోగులకు ఇదొక సువర్ణావకాశం.