వేసవి కాలంలో మన శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. తగిన మొత్తంలో నీరు తాగకపోతే.. డీహైడ్రేషన్ బారిన పడతాం. మరి వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే.. ఏం చేయాలి
వేసవి కాలం మొదలయ్యింది. ఏప్రిల్ నెలలోనే ఎండలు దారుణంగా మండి పోతున్నాయి. ఇక మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేద. భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 11 గంటలు దాటిందంటే.. అడుగు బయటపెట్టాలంటే.. భయపడాల్సిన పరిస్థితి. ఫ్యాన్లు, కూలర్లు నిరంతరం పని చేస్తూనే ఉండాలి. కాసేపు కరెంట్ పోతే ఉక్కపోతతో విలవిల్లాడుతున్నాం. ఇక ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి అని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశార. ఇక వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక వేసవి కాలంలో మనకు ఎక్కువగా వినిపించే మాటలు.. డీహైడ్రేషన్, హైడ్రేషన్. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దాంతో శరీరం వెంటవెంటనే నీటిని కోల్పోతుంది. తరచుగా దాహం వేస్తుంది. మిగతా సీజన్‌లతో పోలిస్తే.. వేసవిలో మన శరీరానికి నీరు కాస్త ఎక్కువ మొత్తంలోనే అవసరం అవుతుంది. తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. స్పృహ కోల్పోతాం. బలహీనంగా మారతారు. మరి వేసవిలో హైడ్రేట్‌గా ఉండాలి అంటే ఏం చేయాలి.. రోజుకు ఎంత నీరు తాగాలి.. అసలు దీన్ని ఎలా లెక్కిస్తారు అంటే..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం ఎంత అవసరమో.. నీరు కూడా అంతే అవసరం. మన శరీరంలో 65-70 శాతం నీరు ఉంటుంది. ఈ నీటి శాతం తగ్గితే నిర్జలీకరణానికి అంటే డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇలా కాకుండా హైడ్రేటెడ్‌గా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. మరి ఓ మనిషి రోజుకు ఎంత నీరు తాగాలి.. ఈ లెక్క దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే.. శరీర బరువు ఆధారంగా మనం తాగాల్సిన నీటి పరిమాణాన్ని లెక్కిస్తారు. మనిషికి, మనిషికి మధ్య ఈ లెక్క మారుతుంటుంది. వైద్యులు చెప్పిన దాని ప్రకారం.. 20 కిలోల బరువున్న శరీరానికి 1 లీటరు నీరు అవసరం. దీని ప్రకారం, 70 కిలోల బరువున్న వ్యక్తి 3.5 లీటర్ల నీరు త్రాగాలి. 80 కిలోల బరువున్న వ్యక్తి 4 లీటర్ల నీరు తాగాలి అని చెబుతున్నారు. అలానే నీటి పరిమాణం ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తరచుగా తీసుకోవాలి.
వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరానికి ఎక్కువ నీరు అవసరం. తరచుగా చెమటలు పట్టడం, టాయిలెట్‌కు వెళ్లడం లేదా పని సమయంలో తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, జ్వరం లేదా లూజ్ మోషన్స్ వస్తున్నట్లయితే, శరీరం పెద్ద మొత్తంలో నీటిని కోల్పోయి చాలా తీవ్రంగా డీహైడ్రేట్ అవుతుంది. ఈ కారణాల వల్ల, శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అయితే డీహైడ్రేట్ లక్షణాలను మనం ముందుగానే గుర్తించవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండ ఉండవచ్చు.
దాహం వేసినప్పుడు వెంటనే నీరు తాగాలి. ఒంట్లో నీటి శాతం ఎంత తగ్గితే అంత దాహం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఒకేసారి ఎక్కువ నీరు త్రాగాలి. అయితే ఈ స్థితిలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల.. కిడ్నీలు కూడా అవసరానికి మించి పని చేయాల్సి వస్తుంది. ఫలితంగా కిడ్నీలు బలహీనమవుతాయి. అందుకే నార్మల్‌గా దాహం వేసినప్పుడు వెంటనే కొద్ది మొత్తంలో నీళ్లు తాగాలి.
చాలా మంది ఎండలో బయట తిరిగి ఇంటికి రాగానే.. ముందుగా గబాగబా మంచినీళ్లు తాగుతారు. ఇలా చేయడం వల్ల ప్రమాదం అంటున్నారు వైద్యులు. ఎంత దాహం వేసినా సరే.. గబా గబా తాగకుండా.. ఒక్కో బుక్క నీరు తాగాలి. ఇలా తాగడం వల్ల.. నోటిలో ఉండే అమైలేస్ వంటి కొన్ని ఎంజైములు పెద్ద పరిమాణంలో.. నీటితో కలిసి కడుపులోకి వెళ్తాయి. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది కనుక నెమ్మదిగా నీరు తాగాలి.
డీహైడ్రేషన్, అతిసారం వంటి సమస్యలు వచ్చినప్పుడు శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. అలాంటి సమయంలో.. ఒక లీటర్ నీటిలో సోంపు గింజలు కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. దీన్ని రోజుకు మూడు, నాలుగు గ్లాసులు తాగడం వల్ల.. సమస్య నుంచి బయటపడవచ్చు. సోంపు ప్రభావం వల్ల శరీరం చల్లబడుతుంది.
డీహైడ్రేషన్ సమస్య నుంచి త్వరగా కోలుకోవడంలో తులసి కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో తులసి ద్రావణం, మూలకాలు సులువుగా లభిస్తున్నాయి. వీటిని తెచ్చుకుని నీటిలో కలుపుకుని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు.
డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడాలంటే చెరుకు బాగా ఉపయోగపడుతుంది. చెరుకు రసాన్ని నీటిలో కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.