సూర్యగ్రహణం.. ఈ ఏడాదిలో రెండోవది.. అలాగే చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న ఏర్పడనుంది. అయితే ఇది పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే. ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కొన్ని నగరాల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది. అలాగే ప్రపంచంలోనూ చాలా కొద్ది దేశాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. అయితే ఈ సూర్యగ్రహణం మంగళవారం సాయంత్రం 5.01 గంటలకు మొదలై 6.26 గంటల వరకు కొనసాగనుంది. ఈ సమయం అనేది ప్రాంతాలను బట్టి కాస్త మారుతూ ఉండచ్చు. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం సమయం పరిశీలిస్తే.. హైదరాబాద్ లో సాయంత్రి 4.49 నుంచే గ్రహణం చూడచ్చని చెబుతున్నారు. అలాగే విశాఖలో అయితే సాయంత్రి 5.01 నుంచి గ్రహాణాన్ని వీక్షించ వచ్చంటున్నారు.
ఈ పాక్షిక సూర్యగ్రహణం స్వాతి నక్షత్రం నందు సంభవిస్తోంది. కావున తులారాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. అలాగే ఎవరికి శుభఫలితాలు, ఎవరికి ప్రతికూల ఫలితాలు ఇస్తుందనే సందేహాలు కూడా లేకపోలేదు. ఈసారి వస్తున్న పాక్షిక సూర్యగ్రహణం సింహ, వృషభ, మకర, ధనుస్సు రాశుల వారికి శుభఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. అలాగే కన్య, మిథునం, మేషం, కుంభ రాశుల వారికి మధ్యస్త ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. కర్కాటక, తుల, మీన, వృశ్చిక రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ పాక్షిక సూర్య గ్రహణం సమయంలో జ్యోతిష్యం ప్రకారం.. పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.
గ్రహణం రోజు పట్టు విడుపు స్నానాలు చేయాలని చెబుతుంటారు. పుణ్య నదుల్లో స్నానమాచరిస్తే ఇంకా మంచిదని పెద్దల నానుడి. అలాగే ఈ గ్రహణం సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. అందుకని మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆహార నియమాలు పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు. గ్రహణం సమయంలో సూర్య భగవాణుడిని ఆరాధిస్తూ, ఆయన పారాయణం చేసుకోవాలని చెబుతుంటారు. అలాగే రాహు జపం, దుర్గాదేవి ఆరాధన వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. సూర్య గ్రహణం వీడిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే ఇంటి మూలల్లో గంగాజలం జల్లుకోవాలంట.