మనందరి ఇష్ట దైవం ఆ శ్రీరాముడి జన్మదినం ఈరోజు. ఇదే రోజున సీతారాముల కళ్యాణం కూడా. మరి ఈ శ్రీరామనవమికి ఏం చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం పొందుతాము? ఎలాంటి పనులు చేస్తే జీవితం బాగుంటుంది? అనే విషయాలు మీ కోసం.
ఎటువంటి కుళ్ళు, కల్మషం, స్వార్థం, అసూయ, భయం, కోపం వంటి రాగద్వేషాలకు లొంగకుండా అన్నిటినీ అధిగమించి జీవించేదే భగవంతుడు. మనుషులు కూడా భగవంతుడిలా జీవిస్తే సమస్త విశ్వం సుఖంగా జీవిస్తారు. విలువలతో బతికితే సమాజం ఎంతో బాగుంటుంది. అయితే భగవంతుడు కాబట్టి, ఆయనకు అతీత శక్తులున్నాయి కాబట్టి ఆయన నిరాడంబరంగా, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా జీవిస్తాడు. కానీ మనుషులకు అది సాధ్యం కాదు కదా అన్న ప్రశ్న మనిషికి రానివ్వకుండా మానవ అవతారంలో ఈ నేలపై అడుగుపెట్టి.. మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి, రాజులా బతికి తండ్రికిచ్చిన మాట కోసం అంతఃపురం నుంచి అడవులకు పయనమయ్యి.. సుఖాలను వదిలిపెట్టి కష్టాలను అనుభవించి, భరించి, సహించి.. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా గానీ వ్యక్తిత్వాన్ని కోల్పోనటువంటి పురుషోత్తముడు మన శ్రీరాముడు.
పుట్టినప్పటి నుంచి అవతారం చాలించినంత వరకూ ఉన్నతమైన విలువలతో జీవించినటువంటి మహోన్నత వ్యక్తి రాముడు. భగవంతుడే అయినా మనిషిగా ఈ నేల మీద ఏ మనిషీ ఎప్పటికీ పడనటువంటి కష్టాలను అనుభవించి.. విలువలతో జీవించి మనకి ఆదర్శప్రాయుడుగా నిలిచాడు. శ్రీరాముడు సాక్షాత్తు ఆ మహావిష్ణువు అవతారం. త్రేతాయుగమున వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. శ్రీరాముడు జన్మించిన రోజునే శ్రీరామనవమిగా మనం జరుపుకుంటున్నాము. అయితే ఇదే రోజున శ్రీరాముడు సీతా సమేతంగా రావణ సంహారం తర్వాత అయోధ్య చేరుకొని తిరిగి పట్టాభిషిక్తుడయ్యాడు.
సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగింది. శ్రీరాముని జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు శ్రీరామనవమి రోజున జరగడం వల్ల ఈరోజుకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మనిషి జీవితంలో ముఖ్య ఘట్టాలు జన్మదినం, ఉద్యోగం, కళ్యాణం. మీ జన్మదినాన్ని పది మంది ఒక వేడుకలా జరుపుకోవాలన్నా.. ఉద్యోగం అది వ్యాపారమైనా, వృత్తి అయినా, స్వయం ఉపాధి అయినా మరేదైనా గానీ నిలకడగా, సాఫీగా సాగాలన్నా.. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం జరగాలన్నా, దాంపత్య జీవితం బాగుండాలన్నా శ్రీరామనవమి రోజున ఈ పనులు చేయాలని పండితులు చెబుతున్నారు.
శ్రీరామనవమి రోజున పూజ నిష్టగా చేస్తే ఏడాది మొత్తం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. రామాయణంలోని కొన్ని శ్లోకాలైనా చదవాలి. సంతానం లేని వారికి ఉపయోగపడే పుత్రకామేష్టి యాగంకు సంబంధించిన ఘట్టాన్ని చదువుకోవాలి. సీతారాముల కళ్యాణాన్ని తిలకించడం ద్వారా మంచి జరుగుతుంది. ఈరోజున కళ్యాణ మంత్రాలు వినాలి. కళ్యాణ సమయంలో తలంబ్రాలు పోసే దృశ్యాన్ని చూసిన వారికి ఆహారానికి లోటు ఉండదని చెబుతారు. రాముల వారి చిత్ర పటానికి గంధం, బొట్టు పెట్టి పూలు సమర్పించి.. రామ రక్షా స్తోత్రం చదవాలి. రామనామం జపిస్తే అంతా మంచే జరుగుతుంది. రాముల వారిని తులసీదళంతో, సీతమ్మ వారిని మారేడు ఆకులతో, హనుమంతుల వారిని తమలపాకులతో పూజించాలి. ఇలా చేస్తే ఏడాది మొత్తం బాగుంటుందని పండితులు చెబుతున్నారు. స్వామివారికి ఇష్టమైన వడపప్పు తయారుచేసి నివేదించాలి.
సీతారాములు అంటేనే ఆదర్శ దంపతులు. సహనంలో రాముడు ఆకాశం, సీత భూదేవి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఈ ఒక్కరోజు ప్రశాంతంగా ఉంటే మంచి జరుగుతుంది. సీతారాముల కళ్యాణ సమయంలో వాడే తలంబ్రాలను.. ఎవరి పెళ్లి సమయంలో అయినా తలంబ్రాలలో కలిపితే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉండడం వల్ల సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. చేసిన పాపాలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పఠించడం, లేనివారికి దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుంది. రాముడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి పూజ మధ్యాహ్న సమయంలో చేస్తే మంచిదని భావిస్తారు. దశమి తిథి వరకూ 9 రోజుల పాటు అఖండ దీపం వెలిగిస్తే శుభం చేకూరుతుంది. సమస్యలు ఏమైనా ఉంటే పండుగ ముగిసేవరకూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగించాలి.
ఇక సీతారాములు జీవించినట్టు అణువంత అయినా పవిత్రంగా జీవిస్తే జీవితంలో అద్భుతాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. రాముడంతటి మహానుభావుడికే కష్టాలు తప్పలేదు, ఆ తర్వాత సుఖాలు రాకుండా పోలేదు. కాబట్టి మనిషి తన ప్రయత్నంగా పవిత్రంగా జీవిస్తూ.. ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తే రాముడి ఆశీస్సులు తోడై జీవితం ఆనందమయమవుతుంది. పవిత్రమైన మనసు కోసం, పవిత్రమైన ఆలోచనల కోసం, ఏకాగ్రత కోసం శ్రీరామనవమి రోజున మాత్రమే కాకుండా నిత్యం ఆ రాముడి ముందు కూర్చుని రామ నామం జపించాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ ఆత్మీయులకు, ఆప్తులకు అందరికీ శుభం చేకూరాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సర్వేజనా సుఖినోభవంతు. లోకా సమస్తా సుఖినోభవంతు. ఆ ఆదర్శ రాముడిని తలచుకుంటూ జై శ్రీరామ్ అని కామెంట్స్ మీ భక్తిని తెలియజేయండి.