ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవ్వరమూ చెప్పలేము. సాధారణంగా ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడం జరుగుతుంటుంది. కానీ, కొన్నికొన్ని సార్లు చాలా అరుదైన ప్రేమ కథలు తెరపైకి వస్తుంటాయి. అలాంటి కథే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఈ కథలో ఓ ఇద్దరు అన్నదమ్ములు ఒకే యువతిని ప్రేమించారు. ఆ యువతి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా ఇద్దరితో ప్రేమలో పడింది. చివరకు ముగ్గురూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. కలిసి జీవించాలన్న బలమైన కోరికతో ఇంట్లోంచి పారిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఉత్తర ప్రదేశ్, బరేళిలోని షేర్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ 25 ఏళ్ల యువతిని అదే ప్రాంతానికి చెందిన ఓ ఇద్దరు అన్నదమ్ములు ప్రేమించారు. ఆ యువతి వారి ప్రేమకు ముచ్చటపడి ఇద్దర్నీ ప్రేమించింది. ఈ విషయమే ఆ ఇద్దరికీ చెప్పింది. దీంతో ఇద్దరూ ఆమె ప్రేమకు దాసోహం అయ్యారు. ఏది చేసినా కలిసేచేద్దాం అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి ప్రేమ విషయం వారి ఇళ్లల్లో తెలిసింది. ఇరు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గుర్నీ చావ చితక్కొట్టారు. అయినా వారు వెనకడుగు వేయలేదు.
తాజాగా, ముగ్గురూ ఇంటినుంచి పారిపోయారు. పిల్లలు ఇంట్లో కనిపించకపోయే సరికి పెద్దలకు విషయం అర్థం అయింది. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఆ అమ్మాయిని మొదట తమ మేనమామ ఇంటికి తీసుకెళ్లినట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురికీ ఆశ్రయం ఇచ్చిన అబ్బాయిల మేనమామపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడినుంచి కూడా పరారైన ముగ్గురికోసం వెతుకుతున్నారు.