ఓ మహిళ వీరత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తన ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలతో వీరోచితంగా పోరాడింది. కత్తులకు సైతం భయపడకుండా వారితో గొడవపడింది. రక్తం కారుతున్నా వెనకడుగేయకుండా దొంగలను తరిమికొట్టింది. ఈ సంఘటన విశాఖపట్నంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నంలోని చీమలాపల్లికి చెందిన ఆళ్ల అప్పారావు, లలిత కుమారి దంపతుల ఇంట్లో మంగళవారం అర్థరాత్రి ఇద్దరు దొంగలు పడ్డారు. ఇంటి కిటికీ గ్రిల్‌ను తొలగించి లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో అప్పారావు, లలిత కుమారి, వారి పెద్ద కుమారుడు వినయ్ ఓ గదిలో నిద్రిస్తున్నారు.
వారి చిన్న కుమారుడు నైట్ డ్యూటీకి వెళ్లగా.. అతడి భార్య లావణ్య ఒంటరిగా మరో గదిలో నిద్రిస్తోంది. దుండగులు అప్పారావు నిద్రిస్తున్న గది తలుపును బయటినుంచి గడియపెట్టారు. ఒంటరిగా ఉన్న లావణ్య నిద్రిస్తున్న గది తలుపు బద్ధలు కొట్టి లోపలికి ప్రవేశించారు. తలుపు తెరుచుకున్న చప్పుడు అవటంతో లావణ్య నిద్రలేచింది. రూములోకి వస్తున్న వారిని చూసింది. ఏమాత్రం భయపడకుండా వారిని పట్టుకుని గట్టిగా కేకలు వేసింది. దొంగలను ఎటూ కదలనీయకుండా అడ్డం పడసాగింది. ఈ నేపథ్యంలోనే పక్క గదిలోని వారు కూడా నిద్రలేచారు.
ఇంట్లో దొంగలు పడ్డారని అర్థమై వారు కూడా కేకలు వేయటం మొదలుపెట్టారు. ఇక, ఆ ఇంట్లో దొంగతనం చేయటం సాధ్యంకాదని దొంగలకు అర్థమైంది. వెంటనే అక్కడినుంచి పారిపోవటానికి ప్రయత్నించారు. లావణ్య వారిని పోనివ్వలేదు. దీంతో వారు ఆమెపై కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను పక్కకు తోసి పరుగులు తీశారు. వారు వెళ్లిపోగానే లావణ్య పక్కగది దగ్గరకు వెళ్లింది. గది తలుపులు తీసింది. లోపల ఉన్న ముగ్గురు బయటకు వచ్చారు. లావణ్యను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.