అతడో డాక్టర్. దేవుడి తర్వాత దేవుడంతటి వాడు. ఎంతో గొప్పదైన వైద్య సేవలో తరించటం మానేసి.. పాడు పనులకు తెరతీశాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు. మరికొంత మందితో ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. ఆఖరికి మహిళా రోగులతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. భార్యతో గొడవ కారణంగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, జలౌన్‌లోని కాన్పూర్ జనత్‌కు చెందిన రాజీవ్ అనే వ్యక్తి వైద్య వృత్తిలో ఉన్నాడు. కాన్పూర్ దెహత్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నాడు.
రాజీవ్‌కు మధ్య ప్రదేశ్‌కు చెందిన స్వప్న అనే యువతితో గత ఫిబ్రవరి నెలలో పెళ్లయింది. పెళ్లయిన కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాతినుంచి రాజీవ్ భార్యతో గొడవలు పడ్డం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం రాజీవ్‌కు, స్వప్నకు గొడవైంది. గొడవ సందర్భంగా రాజీవ్ తన పాత నేరాలను బయటపెట్టాడు. తాను మొదటి భార్యను ఇంజెక్షన్ ఇచ్చి చంపేశానని, స్వప్నను కూడా అలానే చంపుతానని బెదిరించాడు. దీంతో స్వప్న పోలీసులను ఆశ్రయించింది. అతడిపై కేసు పెట్టింది. తన భర్త ఓ బ్యాంక్ మేనేజర్‌ను ప్రేమ పేరుతో మోసం చేశాడని, లైంగికంగా ఆమెను వాడుకున్నాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది.
తర్వాత ఆమెను బెదిరించి డబ్బులు దోచుకున్నాడని పేర్కొంది. తన భర్తకు తాను మూడో భార్యనని వెల్లడించింది. ఆయనకు భార్యలతో పాటు నలుగురు మహిళలతో అక్రమ సంబంధం కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. రాజీవ్ మహిళా రోగులతో కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని వివరించింది. తనకు, ఇతర బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రార్థించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆధారాల ప్రకారం విచారణ చేపడతామన్నారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని తెలిపారు.