భార్యాభర్తల బంధంలో గొడవలు అనేది సహజం. అయితే ఈ మధ్యకాలంలో గొడవల వలన కొందరు.. తమ భాగస్వామిని హత్య చేయడం లేదా తాను ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. ముఖ్యంగా దంపతుల మధ్య కలిగే అనుమానం, అపనమ్మకం అనేది గొడవలకి ప్రధాన కారణం అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని జంటల మధ్య చిన్న గొడవగా మొదలై.. చిలికి చిలికి గాలివాన కాస్తా తుఫాన్ లా మారినట్లు పెద్దగా మారి..వారిలో ఎవర్నో ఒకర్ని బలి తీసుకుంటుంది. తాజాగా తన భార్య మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఆమెను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపేశాడు ఓ భర్త. అనంతరం ఆమె మృతదేహంపై పూల దండ వేసి నివాళులర్పించాడు. ఈ దారుణమైన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వాతి(35) కి, ప్రకాశం జిల్లా పుల్లల చెరువుకు చెందిన కాకర్ల వెంకట కోటయ్యతో 17 ఏళ్ల కిందట వివాహమైంది. కోటయ్య లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం తెనాలిలో నివాసం ఉంటున్న వీరికి ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. గతంలో స్వాతి ఓ బ్యూటీపార్లర్ లో పని చేసి.. అక్కడ పనిచేసిన సమయంలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది. ప్రస్తుతం పట్టణంలోని ఘంటవారివీధిలో స్వాతి సొంతగా ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈక్రమంలో స్వాతికి ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని ఆమె భర్త కోటయ్యకి అనుమానం ఏర్పడింది. ఈ విషయంలో వారిద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. ఇటీవల ఓ సారి ఇద్దరి మధ్య పెద్దగొడవ జరగ్గా.. స్వాతి పుట్టింటికి వెళ్లింది.
అయితే కొద్ది రోజుల కిందటే ఆమెను తిరిగి తన ఇంటికి కోటయ్య తీసుకొచ్చాడు. అయినప్పటికి అతని తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. ఇంకా స్వాతిపై మరింత అనుమానం పెంచుకుని వేధింపులకు గురి చేసేవాడు. ఇలా వారి మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలోనే స్వాతి బ్యూటీ పార్లర్ నడుపుతుంది. ఈ క్రమంలో గురువారం స్వాతి బ్యూటీపార్లర్ లో ఉండగా.. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడికి కోటయ్య వెళ్లాడు. అదే సమయంలో పార్లర్ లో ఇద్దరు మహిళలు ఉండటంతో బయటనే కొద్ది సమయం వేచి ఉన్నాడు. వారు వెళ్లిన అనంతరం లోపలికి వెళ్లి డోర్ లాక్ చేశాడు. స్వాతితో మరోసారి ఘర్షణకు దిగాడు. ఈక్రమంలో వారిద్దరి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. మందపాటి అద్దంతో చేసిన తలుపు కావడంతో బ్యూటీపార్లర్ లోపల ఏం జరుగుతుందో బయట వారు గుర్తించలేకపోయారు.
స్వాతిపై కత్తితో విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో రక్తపు మడుగులో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత..తన వెంట తెచ్చుకున్న పూల దండను ఆమెపై వేసి నివాళులర్పించాడు కోటయ్య. అనంతరం ఇంటికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి లొంగిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. జూదం, మద్యానికి బానిసైన కోటయ్య, స్వాతి పేరిట ఉన్న స్థలాన్ని అమ్మాలని వేధిస్తున్నాడని, అందుకు నిరాకరించినందుకే చంపేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.