ఈ మధ్యకాలంలో కొన్ని ఆసుపత్రుల్లోని సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారిని డబ్బుల కోసం పీడిస్తుంటారు. ఇస్తే సరి లేకుంటే నానా ఇబ్బందులు పెడతారు. తాజాగా ఓ నర్స్ .. కాన్పు చేసినందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో బాలింతకు లేని ఎయిడ్స్ వ్యాధిని అంటకట్టింది. దీంతో అపార్థం చేసుకున్న బాలింత భర్త.. పసికందు, భార్య తనకు వద్దంటూ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు.ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా చాపాడు మండలం సోమాపురం గ్రామానికి చెందిన బొజ్జ సుభాషిణి పురిటి నొప్పులు రావడంతో ఆదివారం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలో చేరింది. అదే రోజు రాత్రికి సుఖ ప్రసవమై ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొద్దిసేపటికి అక్కడే నర్స్ పనిచేస్తున్న లత.. వారి వద్దకు వచ్చి రూ.2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. డబ్బులు ఎందుకు ఇవ్వాలని బాలింత ప్రశ్నించింది. అయినా.. ప్రస్తుతానికి తన వద్ద డబ్బులు లేవని, ఉదయం భర్త రాగానే ఇస్తానని సుభాషిణి తెలిపింది. ఇది మనస్సులో పెట్టుకున్న ఎఫ్ ఎన్ ఓ లత.. సుభాషిణికి లేని రోగం అంటగట్టింది. తల్లి కూతుర్లను చూసేందుకు సోమవారం ఆమె భర్త గురుప్రసాద్, అత్త ఆస్పత్రికి వచ్చారు.
ఇంతలోనే వారి వద్దకు వచ్చిన లత మీ భార్యకు ఎయిడ్స్ ఉందని గురుప్రసాద్కు చెప్పింది. దీంతో నాకు భార్య, బిడ్డ వద్దని గురుప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత ఆమె వద్దకు వచ్చిన ఎఫ్ఎన్ఓ “నాకు డబ్బులు ఇవ్వనందుకే నీకు ఎయిడ్స్ ఉందని చెప్పానని, ఎలాంటి వ్యాధి లేదు” అని తెలిపింది. ఈ విషయం మీ అత్త, భర్తకు చెప్పు అని సూచించి తిన్నగా అక్కడి నుంచి జారుకుంది. డబ్బులు కావాలంటే ఇస్తాం కదా.. వాటి కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా. డబ్బులు ఇవ్వలేదని ఎఫ్ ఎన్ ఓ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతుంది. డబ్బు కోసం లేని జబ్బును నాకు అంటగట్టింది.
మా అత్త వాళ్లు నన్ను వద్దంటున్నారు” అని బాధితురాలు తన ఆవేదనను తెలిపింది. ఈ విషయంపై బాధితులు సంబంధింత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీని పై స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్..”ఈ విషయమై ఇప్పటికే విచారణ చేశాను. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించాం. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటాను”అని తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.