ఈ కాలం యువతి, యువకులు తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిళ్ల కంటే ప్రేమ వివాహాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీంతో తల్లిదండ్రును సైతం ఎదురించి చివరికి లవ్ మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే పెళ్లి చేసుకున్న ఓ యువతికి గ్రామస్థులు ఊహించని శిక్ష వేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ప్రేమికులు ఎవరు? లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ ప్రేమికులకు గ్రామస్తులు వేసిన శిక్ష ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఏపీలోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాతవీరాపురం. ఇక్కడే తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్న లీలావతి అనే యువతి కడప జిల్లాకు చెందిన శ్రీహరి అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఇద్దరు తల్లిదండ్రులను ఒప్పించి ఏడు నెలల కిత్రం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లైన నాటి నుంచి లీలావతి అత్తింట్లో భర్తతో కాపురం చేస్తూ వచ్చింది. అయితే ఇక ఈ నెల 14న ఈ నవ దంపతులు ఇద్దరు లీలావతి ఇంటికి పాతవీరాపురం వచ్చారు.
ఇక వీరి రాకను గమనించిన కొందరు గ్రామ పెద్దలు యువతి ప్రేమ పెళ్లి చేసుకోవడంపై కోపంతో ఊగిపోయారు. ఇదే విషయమై ఈ గ్రామ పెద్దలంతా ఈ లీలావతి ఇంటికి వచ్చి.. మీ కూతురు గ్రామ కట్టుబాట్లను తుంగలో తొక్కి ప్రేమ వివాహం చేసుకుందని, దీనికి శిక్షగా రూ.50 వేలు జరిమానా విధిస్తున్నామని, ఖచ్చితంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనికి లీలావతి కుటుంబ సభ్యులు సైతం సరేనంటూ కాస్త టైమ్ కావాలని కోరారు. అలా కొన్ని రోజులు గడచింది. వీరికి ఇచ్చిన సమాయానికి కూడా లీలావతి తల్లిదండ్రులు డబ్బులు చెల్లించలేదు.
దీంతో కోపంతో ఊగిపోయిన ఆ గ్రామ పెద్దలు లీలావతిపై దాడికి ప్రయత్నించారు. గ్రామ పెద్దల దాడిలో లీలావతి తీవ్ర గాయాల పాలైంది. వెంటనే స్పందించిన తల్లిదండ్రులు కూతురు లీలావతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై లీలావతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.