సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. సాయం చేసిన స్నేహితుడి చేత గుంత తవ్వించి అదే గుంతలో అతనిని పాతిపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్ చెరు పరిధిలోని గౌతంనగర్ కాలనీలో సమీర్ అహ్మద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి షేక్ ఇలియాస్, రుస్తం అలీ, అల్లావుద్దీన్ అనే స్నేహితులు ఉన్నారు. అయితే ఇటీవల తన స్నేహితుడైన షేక్ ఇలియాస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకున్న సమీర్.., తన తండ్రికి చెప్పి రూ.50 అప్పుగా ఇప్పించాడు. ఇక కొన్ని నెలల తర్వాత ఇలియాస్ ఇస్తానని తీసుకున్న అప్పు ఇంకా తిరిగివ్వ లేదు.
రోజులు గడిచిపోతున్నా.. ఇలియాస్ మాత్రం తీసుకున్న డబ్బులు సమీర్ అడుగుతున్నా ప్రతీసారి లేవనే సమాధానం చెబుతున్నాడు. అయితే ఇటీవల సమీర్ తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేనంటూ పదిమందిలో పట్టుబట్టాడు. సమీర్ డబ్బుల గురించి పదిమందిలో ఇలియాస్ ను నిలదీయడంతో కాస్త అవమానంగా భావించాడు. తన పరువు తీసేలా ప్రవర్తించిన సమీర్ ను హత్య చేయాలని ఇలియాస్ ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఇలియాస్.., తన స్నేహితులైన రుస్తుం అలీ, అల్లావుద్దీన్ లకు ఇదే విషయాన్ని చెప్పాడు. స్నేహితుడి మాటను కాదనలేక ఆ ఇద్దరూ సరేనన్నారు.
ఇక పథకం ప్రకారమే.. ఈ నెల 8న ఇలియాస్ కొందరు వ్యక్తులతో గుంత తవ్వించాడు. దీంతో పాటు సమీర్ ను కూడా రప్పించి ఆ ముగ్గురు స్నేహితులు అతనితో ఆ గుంతను మరింత లోతుగా తవ్వించారు. ఇక మరుసటి రోజు ఇలియాస్ సమీర్ కు ఫోన్ చేసి.. నిన్న మృతదేహం రాలేదని, మనం తవ్విన గుంతను పూడ్చడానికి రావాలంటూ నమ్మించి తీసుకెళ్లారు. ఇక అక్కడికి వెళ్లాక తవ్విని ఆ గుంతను అందరూ పూడ్చేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే అల్లావుద్దీన్ సమీర్ తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. ఈ దెబ్బతో సమీర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అదే గుంతలో సమీర్ ను పడేసి అతనిపై రాళ్లు వేసి అనంతరం ఆ గుంతను పూడ్చేశారు.
ఇక సాయంత్రం అయినా తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో సమీర్ తండ్రి ఇలియాస్ కు ఫోన్ చేసి అడిగాడు. నాకు తెలియదంటూ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఎందుకో అనుమానమొచ్చిన సమీర్ తండ్రి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీర్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముగ్గురు నిందితులను విచారించగా అసలు విషయం బయటపెట్టారు. సమీర్ ను మేమే హత్య చేశామంటూ ఒప్పుకున్నారు. అనంతరం పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.