ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న అనేక మంది దంపతుల కాపురాలు మధ్యలో నిట్టనిలువున కూలిపోతున్నాయి. కాదు కాదు.. కూల్చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా కొందరు హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటుంటే.., వరకట్న వేధింపుల కారణంగా మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అచ్చం ఇలాగే ఓ భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఒకటవ వార్డులో నాగరాజు, విజయలక్ష్మి (40) దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు గత 15 ఏళ్ల కిందట కులాలు వేరైన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. కానీ కుమారుడు గతంలోనే మరణించాడు. ఇక భర్త నాగరాజు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ముఠాగా పని చేస్తుండగా, భార్య ఇంటి వద్దే ఉంటూ టైలరింగ్ కుట్టుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో వీరి కాపురం సంతోషంగానే సాగుతూ వచ్చింది. కానీ కొన్ని రోజులు గడిచాక నాగరాజు ప్రవర్తనలో మార్పొచ్చి భార్యను అనుమానంతో వేధించడం మొదలు పెట్టాడు. భర్యను కొడుతూ తిడుతూ ఉండేవాడు.
అలా ఏడాది పాటు నాగరాజు భార్య విజయలక్ష్మిని టార్చర్ పెడుతూనే ఉన్నాడు. అయితే ఈ దంపతుల మధ్య ఇటీవల మరోసారి గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. దీంతో వీరి గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఇక కోపంతో ఊగిపోయిన భర్త ఆదివారం ఉదయం భార్య విజయలక్ష్మి ఇంట్లో పనులు చేస్తుండగా దారుణానికి ఒడిగట్టాడు. ఇనుప రాడ్డుతో నాగరాజు భార్య తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో భార్య విజయలక్ష్మి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఇక ఈ దారుణాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై విజయలక్ష్మి కుటుంబ సభ్యులు భర్త నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.