అతడు ఓ సాధారణ వ్యక్తి. నర్సరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అవసరం కావడంతో యజమాని దగ్గర అప్పు చేశాడు. కారణం ఏంటో తెలీదు గానీ చేతిలో డబ్బుల్లేక సమయానికి అప్పు తీర్చలేకపోయాడు. ఓనర్ ఏమంటాడోననే భయంతో అతడి దగ్గర పని కూడా మానేశాడు. దీంతో సదరు యజమానికి కోపం వచ్చింది. ఏకంగా తన దగ్గర పనిచేసే వ్యక్తి భార్యని తీసుకొచ్చేశాడు. ఇప్పుడు విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ వైస్సాఆర్ జిల్లాలోని మైదుకూరు మండలం జీవీ సత్రంలో ఈ అమానుష సంఘటన జరిగింది. జీవీ సత్రం యజమాని సుధాకర్ రెడ్డి దగ్గర ఎస్టీ కాలనీకి చెందిన సుబ్బరాయుడు రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే సుబ్బరాయుడు అప్పు చెల్లించకపోగా ఆయన వద్ద పని కూడా మానేశాడు. తన అప్పు తిరిగివ్వాలని వారం రోజుల క్రితం సుధాకర్ రెడ్డి.. సుబ్బరాయుడు ఇంటికెళ్లాడు. ఆ టైంలో సుబ్బరాయుడు లేకపోవడంతో అతడి భార్య నాగమణిని తీసుకొచ్చేశాడు. అప్పు తీర్చేవరకు ఇంటికి పంపేది లేదని కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పాడు.
అయితే అప్పు కట్టే స్తోమత లేకపోవడంతో గత్యంరం లేని స్థితిలో సుబ్బరాయుడు.. గురువారం, మైదుకూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. నర్సరీకి వెళ్లిన పోలీసులు.. చంటి బిడ్డతో ఉన్న నాగమణిని, సుబ్బరాయుడు కుటుంబ సభ్యులకు అప్పగించారు. నర్సరీ ఓనర్ సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అప్పు చెల్లించకపోతే వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకోవాలని గానీ.. మహిళని తీసుకెళ్లడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరి అప్పు కోసం మహిళని నిర్బంధించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.