మగ స్నేహితులతో కలిసి వీడియోలు చేయవద్దని మారుతీ రాథోడ్ తన ప్రియురాలకి చెప్పాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. వాళ్లు తన స్నేహితులని.. వీడియోలు చేయటంలో తప్పేమీ లేదని అంది.
ఏ బంధమైనా అనుమానం అనే పునాదులపై ఎక్కువ కాలం నిలబడలేదు. నమ్మకం లేని చోట గొడవలు, దారుణాలే పై చెయ్యి సాధిస్తాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే మారుతీ రాథోడ్- పెండలాల జీవితం. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అనుమానం వీరి ప్రేమలో నిప్పులు పోసింది. మగ స్నేహితులతో వీడియోలు చేస్తోందన్న కారణంతో మారుతీ తన ప్రియురాలిని దారుణంగా చంపేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని యాదగిరి తాలూకాకు చెందిన మారుతీ రాథోడ్ ఇళ్లకు పేయింటింగ్‌లు వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు కొన్నేళ్ల క్రితం ముంబై వచ్చాడు.
ఇతడికి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పెండెలా వర్మ అనే యువతితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత రెండేళ్లనుంచి ఇద్దరూ పోటాపోటీగా ప్రేమించుకుంటున్నారు. పెండాలకు సోషల్ మీడియాలో వీడియోలు చేసి పెట్టడం ఓ పిచ్చిగా మారింది. నిత్యం తన మగ స్నేహితులతో కలిసి వీడియోలు చేస్తూ ఉండేది. ఇది మారుతీకి నచ్చేది కాదు. ఈ విషయమై తన ప్రియురాలితో గొడవలు పడుతూ ఉండేవాడు. కొద్దిరోజుల క్రితం కూడా ఇద్దరికీ ఇదే విషయమై గొడవవైంది. ‘‘ ఇంతకు ముందు నువ్వు ఎలాగ ఉన్నావో నాకు తెలీదు. ఇకపై నువ్వు అలా మగాళ్లతో వీడియోలు చేయటం నాకు ఇష్టం లేదు’’ అని చెప్పాడు.
ఇందుకు పెండలా ఒప్పుకోలేదు. ‘‘ వాళ్లు నా స్నేహితులు. నాతో వీడియోలు చేయవద్దని నేనెలా వారికి చెప్పగలను’’ అని తెగేసి చెప్పింది. దీంతో మారుతీకి కోపం వచ్చింది. ఆమెను ఎలాగైనా చంపాలని అనుకున్నాడు. తన సొంత ఊరికి పెండాలను తీసుకువచ్చాడు. ఇంట్లో ఎవ్వరూ లేనపుడు ఆమె గొంతు నులిమి చంపేశాడు. తర్వాత శవాన్ని దూరంగా ఉన్న తన సొంత స్థలంలోకి తీసుకుపోయి కాల్చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మారుతీ మీద అనుమానంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.