ముంబైలో తొలిసారిగా ‘గే సెక్స్ రాకెట్’ వెలుగుచూసింది. ఆన్లైన్ గే డేటింగ్ యాప్ ‘Grindr’ ద్వారా పలువురు యువకులు ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని మాల్వాని ప్రాంతం కేంద్రంగా ఈ గ్యాంగ్ ‘గే సెక్స్ రాకెట్’ను నడుపుతోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గలీజు దందాకు తెరలేపారు ముగ్గురు యువకులు. గుట్టుచప్పుడు కాకుండా ‘గే’ సెక్స్ రాకెట్‌ను కొన్ని నెలలుగా నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నఈ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాంగ్ సభ్యులను ముంబైకి చెందిన ముగ్గురు యువకులు ఫర్ఖాన్ ఖాన్ (26), అహ్మద్ ఫరూక్ షేక్ (24), ఇమ్రాన్ షఫిక్ షేక్ (24) గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యులు పరారీలో ఉన్నారు.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి చోద్యం.. ఏకంగా గ్రామాన్నే కుదవ పెట్టారు కదా
ఈ గ్యాంగ్ మొదటగా.. ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా ‘గే’ సెక్స్ కోరుకునే వ్యక్తులతో పరిచయం పెంచుకుని.. వారికి ‘గే’ సెక్స్‌కు సిద్ధంగా ఉన్న యువకులు తమ దగ్గర ఉన్నారని చెప్పి డబ్బులు దండుకోవడం వీరి పని. అయితే.. అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు ‘గే’ డేటింగ్ యాప్ ద్వారా ఈ ముఠాను సంప్రదించాడు. గంటకు వెయ్యి రూపాయలు అవుతుందని గ్యాంగ్ సభ్యులు యువకునికి చెప్పారు. అంతా ఓకే అనుకున్న తర్వాత తమ ప్లేస్‌కు రమ్మని సదరు అకౌంటెంట్‌కు కబురు పంపారు.
అక్కడికి వెళ్లిన యువకుడు గదిలోకి వెళ్లగానే నలుగురు యువకులు అతనిని కొట్టి అతని ఫోన్ లాక్కున్నారు. పర్స్, మెడలో చైన్ కూడా లాగేసుకున్నారు. అంతటితో ఆగలేదు. అతనిని బెదిరించి నగ్నంగా చేసి, అభ్యంతరకర వీడియోలు తీశారు. అక్కడి నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు.
అక్కడి నుండి బయటపడ్డ యువకుడు జరిగిన విషయాన్నికుటుంబ సభ్యులకు చెప్పుకుని భోరుమన్నాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు యువకుడు. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లో ప్రధానంగా ఈ ముగ్గురు యువకులే కీలక పాత్ర పోషించినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఈ యువకులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.