విరివిరిగా లభిస్తున్న గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి వాటికి యువత బానిసలౌతున్నారు. తాగిన మత్తుల్లో యువకులు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. తాజాగా హైదరాబాదులో చెన్నై నుండి వచ్చిన యువకులు దారుణానికి ఒడిగట్టారు.
మత్తు పదార్థాలకు బానిసలౌతున్న యువకులు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాగిన మత్తుల్లో యువకులు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ఒళ్లు, ఇల్లు గుల్లయ్యే వరకు తాగడం, తాగి రాద్ధాంతం చేయడం, గొడవ చేయొద్దు అన్న వారిపై దాడికి పాల్పడం షరా మామూలు అయిపోతుంది. అంతేకాకుండా విరివిరిగా లభిస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి కూడా బానిసలౌతున్నారు. తాగి గొడవ చేయోద్దు అన్న వాచ్ మన్‌ను ఏకంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. శ్రీనగర్ కాలనీలోని కృష్ణానగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.
స్పైసీ రెస్టారెంట్ రాఘవ గెస్ట్ హౌస్‌లో వాచ్ మన్ హత్య చోటుచేసుకుంది. చెన్నై నుండి ఈ లాడ్జిలో దిగిన మణికంఠ, దినకరన్, నాగరాజు, నరేష్ అనే నలుగురు వ్యక్తులు మద్యం సేవించి, గొడవ చేస్తున్నారు. కాగా, వారిని గొడవ చేయద్దని వారించేందుకు వెళ్లిన వాచ్ మెన్ యాదగిరితో గొడవకు దిగారు. దీంతో మణికంఠ ఫోన్ తీసుకుని పక్కకు విసిరేశాడు యాదగిరి. పూర్తిగా మత్తులో ఉన్నమణికంఠ మూడో అంతస్తు నుండి యాదగిరిని తోసేశాడు . దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్టేషన్ ఘన్ పూర్ నుండి ఉపాధి నిమిత్తం వచ్చిన యాదగిరి.. అదే లాడ్జి వాచ్ మన్‌గా పదేళ్ల నుండి పని చేస్తున్నాడని బంధువులు చెబుతున్నారు. గంజాయి, మద్యం సేవించిన డ్యాన్సర్లు.. పెద్ద పెద్దగా అరుస్తుండటంతో వారిని అలా చేయద్దు అన్నందుకు.. గొడవ పడి యాదగిరి తోసేశారని చెబుతున్నారు. కాగా, పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.