Crime News: ప్రేమోన్మాదుల ఘాతుకాలు రోజురోజుకు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. కొందరు యువకులు తమను ప్రేమించని కారణంగా అమ్మాయిలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రాణాలు కూడా తీస్తున్నారు. మూడు రోజుల క్రితం కాకినాడలో ఓ ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా, చెన్నైలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిని కదులుతున్న రైలు కింద తోసేశాడు. దీంతో ఆ యువతి తల ముక్కలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైకి చెందిన సత్య అనే 23 ఏళ్ల యువతి ఏటీ నగర్‌లోని ఓ కాలేజ్లో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సత్య ఇంటికి కొద్దిదూరంలో ఉండే సతీష్ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నాడు.
గత కొంతకాలం నుంచి ఆమె వెంటపడి వేధిస్తున్నాడు. సత్య తల్లి ఓ కానిస్టేబుల్. అయినప్పటికి సతీష్ భయపడలేదు. వెంటపడి వేధించేవాడు. దీంతో సత్య కుటుంబసభ్యులు సతీష్ ఇంటికి వెళ్లి దీని గురించి చెప్పారు. తమ కూతురి వెంట పడకుండా చూసుకోమ్మని వార్నింగ్ ఇచ్చారు. అయితే, వారి బెదిరింపులకు అతడు భయపడలేదు. వేధింపులు ఆపలేదు సరికదా.. మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో సత్య తల్లి మరోసారి సతీష్ ఇంటికి వెళ్లింది. సతీష్‌ను తన కూతురి వెంట పడనివ్వకుండా చూడమని ప్రాధేయపడింది. ఇందుకు వారు సానుకూలంగా స్పందించలేదు. పైగా సత్య తల్లిని తిట్టిపంపారు. ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యాహ్నం కాలేజ్‌కు వెళ్లటానికి సత్య సేయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది.
సతీష్ ఆమెను ఫాలో అవుతూ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఆమెతో తన ప్రేమ గురించి గొడవపెట్టుకున్నాడు. ఆమె కుదరదని తెగేసి చెప్పింది. దీంతో సతీష్ ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై వెళుతున్న రైలు కిందకు ఆమెను తోశాడు. రైలు చక్రాల కింద ఆమె తల పడి ముక్కలైంది. సత్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అది చూసిన జనం ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వారు తేరుకునే లోపే సతీష్ అక్కడినుంచి పరారయ్యాడు. అక్కడివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సతీష్‌ను వెతికి పట్టుకోవటానికి కొన్ని ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. కొన్ని గంటల్లోనే సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు.