భార్యాభర్తల మధ్య గొడవలు దారుణాలకు తెర తీస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఓ ఇంట్లో మహిళ శవం కుళ్లిన స్థితిలో వెలుగుచూసింది. ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో పొరిగింటి వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. భర్త కనిపించకుండాపోవటంతో అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, బెంగళూరు అర్బన్ జిల్లాలోని ఆనేకల్ తాలూకాకు చెందిన పవిత్ర దంపతులు అక్కడి వినాయకనగర్‌లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. గత కొద్దిరోజుల నుంచి పవిత్ర, ఆమె భర్త కనిపించటం లేదు. ఈ నేపథ్యంలోనే నిన్న వారి ఇంటినుంచి విపరీతంగా వాసన రావటం మొదలైంది. పొరిగిళ్ల వారు ఆ వాసనతో అల్లాడిపోయారు.
ఇంటి దగ్గరకు వెళ్లి చూడగా.. తలుపు బయటనుంచి లాక్ చేసి ఉంది. దీంతో వారికి అనుమానం మొదలైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లారు. లోపల పవిత్ర మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. ఆమె చనిపోయిన తీరును బట్టి పోలీసులు ఆమెది హత్యగా భావిస్తున్నారు. ఆమె భర్త కనిపించకుండా పోవటంతో అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం పవిత్రను ఆమె భర్తే చంపి ఇంట్లో పడేసి పోయి ఉంటాడని భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పవిత్ర భర్త కోసం అన్వేషిస్తున్నారు.