పాన్ నంబర్ ని ఆధార్ తో అనుసంధానం చేయలేదా? అయితే త్వరగా చేయండి. లేకపోతే మీ పాన్ ఇకపై చెల్లదు.
ప్రభుత్వం పాన్ కార్డును, ఆధార్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని చెబుతోంది. మార్చి 31లోపు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు చెల్లుబాటు కాదని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే పాన్, ఆధార్ అనుసంధానంకు సంబంధించి గడువు తేదీ ముగిసింది. రూ. 1000 జరిమానాతో మార్చి 31లోపు అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించింది. మరి మీరు ఆధార్ ను, పాన్ తో లింక్ చేశారా? మీ ఆధార్ తో మీ పాన్ కార్డు లింక్ అయి ఉందో లేదో తెలుసుకున్నారా? అసలు ఈ అనుసంధాన ప్రక్రియ ఎలా పూర్తి చేయాలి? ఆధార్, పాన్ కార్డు ఒకదానినొకటి అనుసంధానం అయ్యిందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పాన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేయాలి. అనుసంధానం చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు చెల్లదు. పాన్ కార్డు లేకపోతే నిబంధనల మేరకు బ్యాంకు లావాదేవీలు చేయడం కుదరదు. అందుకే ఖచ్చితంగా పాన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి.
తెలిసో తెలియకో బ్యాంకు ఖాతా తీసుకోవడం ద్వారా పాన్ తో ఆధార్ నంబర్ అనుసంధానం అయి ఉంటుంది. కొంతమంది వెబ్ సైట్ ద్వారా ఆధార్ ను పాన్ తో అనుసంధానం చేసి ఉంటారు. ఆ విషయం గుర్తు ఉండదు. ఒకవేళ మీ ఆధార్, పాన్ అనుసంధానం అయ్యింది, లేనిది తెలుసుకోవాలనుకుంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లి పాన్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయగానే మీ పాన్, ఆధార్ తో అనుసంధానం అయ్యింది, లేనిది ఒక అలర్ట్ విండో వస్తుంది.
ఆధార్ తో పాన్ అనుసంధానం అవ్వకపోతే జరిమానాతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. జరిమానా చెల్లించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ ద్వారా, రెండు ఎన్ఎస్డీఎల్ వెబ్ సైట్ ద్వారా రెండు మార్గాల ద్వారా జరిమానా చెల్లించి అనుసంధానం చేసుకోవచ్చు.