ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లు.. ఆకాశన్నంటుతున్నాయి. అసలు ఫుల్ ట్యాంక్ కొట్టించి ఎన్ని నెలలు అవుతుందో. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 100 రూపాయలకు పైగానే ఉంది. ఇక ఇంధన ధరలు పెరగడంతో.. దాని ప్రభావం.. మిగతా అన్నింటి మీద పడింది. ఈ నేపథ్యంలో ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది. సదరు కంపెనీ క్రెడిట్ కార్డు వాడితే ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్, లేదా డీజిల్ ఉచితంగా పొందవచ్చని తెలిపింది. కాకపోతే షరతులు వర్తిస్తాయి అని పేర్కొంది. ఆ వివరాలు.
ప్రస్తుతం చాలా మంది రకరకాల కంపెనీల క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. వాటి మీద రివార్డ్ పాయింట్స్ వంటివి వస్తుంటాయి. వాటిని తర్వాత వాడుకోవచ్చు. ఇక తాజాగా ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్ కానీ డిజీల్ కానీ పొందాలనుకుంటే మీ దగ్గర ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు ఉండాలి. ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం చేసుకొని.. సిటీ బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది. ఇండియన్ ఆయిల్ సిటీ పేరుతో ఈ క్రెడిట్ కార్డు ఉంటుంది. దీన్ని ఫ్యూయల్ క్రెడిట్ కార్డు అని కూడా అంటారు.
ఇక ఈ క్రెడిట్ కార్డుతో 68 లీటర్ల పెట్రోల్ ఎలా పొందొచ్చో వివరాలు వెల్లడించింది సిటీ కార్డ్. అదేలా అంటే.. ఈ క్రెడిట్ కార్డుతో జరిపే లావాదేవీల ద్వారా వచ్చే రివార్డ్స్, టర్బో పాయింట్ల విలువ.. 68 లీటర్ల పెట్రోల్ ధరకు సమానమని చెబుతోంది. అంటే.. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే.. వాటికి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అలానే ఇండియన్ ఆయిల్ బంకుల్లోరూ.150తో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తే 4 టర్బో పాయింట్స్ లభిస్తాయి. ఇక కిరాణా షాపులు, సూపర్ మార్కెట్స్‌లో కూడా ప్రతి రూ.150 లావాదేవీపై 2 టర్బో పాయింట్స్ వస్తాయి. అలానే ఇతర ట్రాన్సాక్షన్లపై ప్రతి రూ.150కి ఒక టర్బో పాయింట్ వస్తుంది.
ఇక ఒక టర్బో పాయింట్.. ఒక రూపాయికి సమానం. దీంతో.. బంకుల్లో పెట్రోల్ కొట్టించినప్పుడు క్రెడిట్ కార్డ్ మీద వచ్చి టర్బో పాయింట్స్ రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఇండియన్ ఆయిల్ బంకుల్లో ఒక శాతం ఇంధన సర్ ఛార్జీ మినహాయింపు లభిస్తుంది. ఇలా ఏడాది మొత్తంలో మీరు చేసే ట్రాన్సాక్షన్స్తో వచ్చే రివార్డులు, టర్బో పాయింట్లతో 68 లీటర్ల వరకు ఉచితంగా పెట్రోల్ కానీ డిజిల్ కానీ పొందవచ్చని సిటీ బ్యాంక్ వెల్లడించింది.
సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో వచ్చే టర్బో పాయింట్లను ఎన్నో మార్గాలుగా రిడీమ్ చేసుకోవచ్చు. అయితే ఈ టర్బో పాయింట్లకు.. ఇండియన్ ఆయిల్ బంకుల్లో మాత్రం ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. బంకుల్లో ఒక టర్బో పాయింట్.. ఒక రూపాయికి సమానం. ఇదే విధంగా మేక్మైట్రిప్, ఈజ్‌మైట్రిప్, ఇండిగో, గోఐబిబో, ప్రీమియర్మైల్స్.కో.ఇన్, యాత్రా.కామ్ వంటి చోట్ల ఒక టర్బో పాయింట్‌కు రూ. 25 పైసలు లభిస్తాయి. బుక్‌మైషో, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, షాపర్స్ స్టాప్ వంటి ప్రదేశాల్లో ఒక టర్బో పాయింట్‌తో 30 పైసలు వస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు ఉంటే.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.