జీవిత బీమా, పెన్షన్ పథకాల గురించి అందరికీ బాగా తెలిసే ఉంటుంది. బీమా ఉంటే మీ జీవితానికి ధీమా ఉంటుంది అంటారు. అలాగే ఇప్పటికే ఎన్నో రకాల జీవిత బీమాలు, పెన్షన్ స్కీములు ఉన్న విషయం తెలిసిందే. వీటిలో కూడా ఏది ఎంచుకోవాలి? ఏ స్కీమ్ లో చేరితే మంచిది అనే విషయాలు తెలియదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కేంద్రం తీసుకొచ్చిన అద్భుతమైన పథకం. ఇందులో మీరు డిపాజిట్ చేస్తూ పోతే.. మీకు రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5 వేల వరకు పెన్షన్ వస్తుంది. మరి.. ఆ పథకం వివరాలు ఏంటి? ఆ పథకంలో ఎలా చేరాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
ఇప్పుడు చెప్పుకోబోయేది అటల్ పెన్షన్ యోజన గురించి. దీనిని 2015లో అవ్యవస్థీకృత కార్మికుల కోసం అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. 2015 మే 9న ప్రధాని నరేంద్ర మోది కోల్ కతా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిలో మీరు నెలకు రూ.42 నుంచి రూ.వెయ్యి వరకు డిపాజిట్ చేయచ్చు. ఈ పథకంలో మీరు కనీసం 20 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి. మీకు 60 ఏళ్లు దాటిన తర్వాత నుంచి నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ అందుతుంది. దీనిలో మీరు ఎంత ఎక్కువ డిపాజిట్ చేస్తే.. అంత ఎక్కువ పింఛను అందుతుంది.
ఈ పథకంలో చేరాలంటే మీరు భారతీ పౌరులు అయి ఉండాలి. మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ స్కీమ్ లో చేరేందుకు గరిష్ట వయసు 40 సంవత్సరాలు. 40 ఏళ్లు నిండిన వాళ్లు ఈ పథకంలో చేరేందుకు అనర్హులు. అలాగే గతేడాది అక్టోబర్ నుంచి పన్ను చెల్లింపుదారులను ఈ పథకంలో చేరేందుకు అనర్హులుగా కేంద్రం ప్రకటించింది. ఈ పథకంలో 18 ఏళ్ల సమయంలో చేరితే నెలకు రూ.42 నుంచి రూ.210లోపు మాత్రమే చెల్లించాలి. ఎంత వయసు పెరిగితే మీరు కట్టాల్సిన మొత్తం అంత పెరుగుతుంది.
ఈ స్కీమ్ లో భార్యాభర్తలు ఇద్దరు చేరచ్చు. ఇలా చేరడం వల్ల ఇద్దరికీ పింఛన్ అందుతుంది. వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత చెరో రూ.5 వేలు వరకు పొందవచ్చు. ఇందులో చేరాలంటే మరే ఇతర చట్టబద్దమైన సెక్యూరిటీ స్కీమ్ లో భాగస్వాములు కాకూడదు. మీరు కట్టాల్సిన నెలవారీ మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతా ద్వారా ఆటో డెబిట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ ఆటో డెబిట్ ఆప్షన్ ని ఎంచుకుంటే నెలనెల మీ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుంది. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే.
అన్ని జాతీయ బ్యాంకులు ఈ అటల్ పెన్షన్ ఖాతాను తెరుస్తున్నాయి. ఆ బ్యాంకుల ఆన్ లైన్ లేదా బ్రాంచ్ కి వెళ్లి ఖాతా తెరవచ్చు. వాటి వెబ్ సైట్ లేదా బ్రాంచుల్లో అటల్ పెన్షన్ యోజన ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఖాతా తెరిచేందుకు ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటే చాలు. మీరు అల్ పెన్షన్ యోజన పథకంలో చేరినట్లైతే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మరి మీరు అవ్యస్థీకృత కార్మికులు అయితే ఈ పెన్షన్ స్కీమ్ లో చేరిపోయి.. భవిష్యత్ కు సుస్థిరమైన బాటలు వేసుకోండి.