డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక నగదు చలామణి పూర్తిగా తగ్గిపోయింది. యూపీఐ యాప్స్ ద్వారా క్షణాల్లో పేమెంట్ జరిగిపోతోంది. ‘టీ’ తాగాక పది రూపాయలు చెల్లించాలన్నా వీటి ద్వారానే చెల్లిస్తున్నారు. అంటే.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే.. వంటి యాప్స్ ద్వారా అన్నమాట. అయితే.. వీటి ద్వారా జరిపే చెల్లింపులపై పరిమితులు ఉన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. ఒక వ్యక్తి తన యూపీఐ ఐడీ ద్వారా ఒక రోజులో రూ.లక్ష వరకు నగదును ఇతరులకు బదిలీ చేయడానికి లేదా ఇతరుల నుంచి పొందడానికి అనుమతిస్తోంది. అంతకుమించి చేయలేరు..
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్ పే.. ఆయా ప్లాట్‌ఫామ్స్ వారీగా గరిష్ట పరిమితులు ఎంతన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్ పే లేదా జీపే యూపీఐ ద్వారా ఒక్క రోజులో రూ.లక్షకు మించి ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయలేరు అలాగే.. జీ-పే ద్వారా జరిపే లావాదేవీల సంఖ్య పైనా పరిమితులు ఉన్నాయి. అన్ని రకాల యూపీఐ అప్లికేషన్స్ (మొబైల్ యాప్స్) ద్వారా ఒక రోజులో పది సార్లకు మించి నగదు పంపలేరు. అనగా దీనర్థం.. గూగుల్ పే యూజర్లు ఒకే సారి లక్ష రూపాయల లావాదేవీ లేదా వివిధ మొత్తాలలో 10 లావాదేవీల వరకు చేయవచ్చు. ఆపై ఈ యాప్ నుంచి పేమెంట్స్ చేయలేరు.
గూగుల్ పే తరహాలోనే ఫోన్‌పే ద్వారా ఒక రోజుకు చెల్లింపు పరిమితి రూ. 1 లక్ష ఉంటుంది. అయితే ఇందులో ఒక రోజులో 10 లావాదేవీలు మాత్రమే చేయాలనే పరిమితి లేదు. ఒక రోజులో రూ.లక్ష విలువ మించకుండా వినియోగదారులు ఎన్ని పేమెంట్స్ అయినా చేసుకోవచ్చు.
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం.. యూపీఐ ద్వారా ఒక్కరోజులో గరిష్టంగా రూ. 1 లక్షను బదిలీ చేయడానికి అనుమతిస్తోంది. గంటలోపు రూ.20 వేల వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక గంటలో గరిష్టంగా ఐదు, ఒక్క రోజులో 20 లావాదేవీలు నిర్వహించొచ్చు. మొబైల్ యాప్స్ యూపీఐ ట్రాన్స్ఫర్ లిమిట్, మొబైల్ యాప్స్ ఖాతాదారుల బ్యాంకులను బట్టి కూడా నగదు బదిలీ పరిమితి ఆధార పడి ఉంటుంది.
అమెజాన్ అనుబంధ యూపీఐ యాప్ ‘అమెజాన్ పే’ ద్వారా రోజుకు రూ. 1 లక్ష వరకు చెల్లింపులు చేయవచ్చు. లేదా ఒక రోజులో 20 లావాదేవీలకు అనుమతి ఉంటుంది. అలాగే.. కొత్తగా రిజిస్టర్ అయిన కస్టమర్లు తొలి 24 గంటల్లో గరిష్టంగా రూ.5000 వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు.
ఒకవేళ మీ డెయిలీ ట్రాన్సాక్షన్స్.. యూపీఐ లిమిట్ కంటే తక్కువగా ఉన్నా.. మీ అమౌంట్ పేమెంట్ కావడం లేదంటే.. మరో బ్యాంకులో ట్రై చేయొచ్చు. ఎందుకంటే.. ప్రతి బ్యాంకుకు ఒక డెయిలీ ట్రాన్స్ ఫర్ లిమిట్ ఉంటుంది. డబ్బులు బదిలీ చేయాలన్నా.. క్రెడిట్ కావాలన్నా ఆయా బ్యాంకుల రోజువారీ ట్రాన్సాక్షన్ల లిమిట్ పై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గమనించాలి. మోసపూరిత లావాదేవీలు జరగకుండా ఉండేందుకు వీలుగా ఈ పరిమితులు తీసుకొచ్చారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.