నార్త్ హైదరాబాద్ లో ఉన్న గాజుల రామారం, మల్లంపేట, జీడిమెట్ల, మియాపూర్, కూకట్ పల్లి వంటి ఏరియాల్లో ఫ్లాట్ ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.
హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదా ఫ్లాట్ ఉంటే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు అని చాలా మంది అనుకుంటారు. లక్షల్లో జీతం తీసుకునే కార్పొరేట్ ఉద్యోగులంటే.. హైదరాబాద్ లో విలాసవంతమైన ఫ్లాట్లు, విల్లాలు కొనగలరు గానీ సామాన్యుడికి సాధారణ ఫ్లాట్ కూడా కొనలేని పరిస్థితి. అయితే సిటీకి 15 కి.మీ. దూరంలో సామాన్యుడు భరించగలిగే బడ్జెట్ లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. కూకట్ పల్లికి 14 కి.మీ. దూరంలో ఉన్న బీరంగూడ ఏరియా బాగా అభివృద్ధి చెందింది. సీసీ రోడ్లు, ఫుట్ బ్రిడ్జులు, ఫ్లై ఓవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం, మెట్రో పార్కులు, 24 గంటల విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాలు ఉన్న కారణంగా బీరంగూడ ఏరియా ఇల్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు అనుకూలంగా ఉంది.
ఈ ఏరియాలో సగటున చదరపు అడుగు రూ. 3,500 పడుతుంది. రూ. 3250 నుంచి రూ. 4800 మధ్యలో ఫ్లాట్ రేట్లు ఉన్నాయి. ఒక ఏడాదిలో బీరంగూడలో ఫ్లాట్ ధరలు 5.6 శాతం పెరిగాయి. గడిచిన మూడేళ్ళలో 35.7 శాతం, ఐదేళ్ళలో 38.2 శాతం, పదేళ్లలో 90 శాతం ఫ్లాట్ ధరలు పెరిగాయి. బిల్డర్ ఫ్లోర్ ధరలు గత ఏడాదిలో 34.9 శాతం పెరిగాయి. మూడేళ్ళలో 18.4 శాతం, ఐదేళ్ళలో 31.8 శాతం పెరిగాయి. ఓవరాల్ గా ఐదేళ్ళలో రూ. 38.2 శాతం పెరిగింది. 2018లో బీరంగూడలో చదరపు అడుగు రూ. 2,750 ఉండేది. ఇప్పుడు అది రూ. 3,500కి పెరిగింది. చదరపు అడుగుకు రూ. 700 పెరిగింది. అంటే ఐదేళ్ల క్రితం చదరపు అడుగు రూ. 2,750 చొప్పున 600 చదరపు అడుగుల 1 బీహెచ్కే ఫ్లాట్ ఖరీదు రూ. 16,50,000. అదే 1000 చదరపు అడుగుల ఫ్లాట్ ఐతే రూ. 27,50,000 ఉంటుంది.
ఇలా ఐదేళ్ల క్రితం ఫ్లాట్ కొన్న యజమానులు ఇప్పుడు రీసేల్ చేస్తున్నారు. ఇప్పుడు సగటున చదరపు అడుగు రూ. 3,500 పలుకుతుంది. అప్పట్లో 600 చదరపు అడుగుల ఫ్లాట్ కొన్నవారు ఇప్పుడు చదరపు అడుగు రూ. 3500 చొప్పున రూ. 21 లక్షల నుంచి రూ. 35 లక్షల రేంజ్ లో అమ్ముతున్నారు. విస్టీర్ణం బట్టి ఈ రేట్లు పెరుగుతాయి, తగ్గుతాయి కూడా. ఇలా ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫ్లాట్లను ఓనర్లు, బిల్డర్లు ఇప్పుడు రీసేల్ చేస్తున్నారు. అయితే ఐదేళ్లు, ఆలోపు ఉన్న ఫ్లాట్లు కొనుక్కోవడం మంచిది. మరీ పది, పదిహేనేళ్ళు దాటిన ఫ్లాట్లు కొనడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అసలే ఫ్లాట్ జీవిత కాలం 30 నుంచి 40 ఏళ్ళు.
అందులో 10, 15 ఏళ్ళు పోతే ఇంకేమైనా ఉందా? అందుకే ఐదేళ్ల వయసున్న ఫ్లాట్ కొనడం సామాన్య, మధ్యతరగతి వాళ్ళకి ఉత్తమం అని చెప్పవచ్చు. రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల లోపు బడ్జెట్ పెట్టుకుంటే మీకు బీరంగూడలో 1 బీహెచ్కే ఫ్లాట్ వస్తుంది. కొంచెం విశాలంగా ఉండాలనుకుంటే రూ. 30 లక్షలు పెట్టాలి. బీరంగూడ మాత్రమే కాదు నార్త్ హైదరాబాద్ లోని గాజుల రామారం, మల్లంపేట, జీడిమెట్ల, మియాపూర్, కూకట్ పల్లి వంటి ఏరియాల్లో కూడా ఫ్లాట్స్ ని రీసేల్ చేస్తున్నారు. ఈ ఏరియాల్లో సగటున చదరపు అడుగుల్లో ఫ్లాట్ ధరలు ఎలా ఉన్నాయో చూడండి.
గమనిక: ఇవి సగటు ధరలు మాత్రమే. ఈ రేంజ్ నుంచి మొదలవుతాయి. ఇంతకంటే ఎక్కువ ధరలు కలిగిన ఫ్లాట్స్ కూడా ఉండవచ్చు. అయితే ఈ ఏరియాల్లోని లొకాలిటీస్ బట్టి హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. ఈ రేట్లు ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేము. అవగాహన కోసం ఇవ్వబడిన సమాచారం మాత్రమే అని గమనించగలరు. అసలు ధరల కోసం స్థానిక ఏరియా ఏజెంట్లను గానీ, ఫ్లాట్ యజమానులను గానీ సంప్రదించవలసినదిగా మనవి.