బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. సక్సెస్‌ఫుల్‌గా మొదటి వారం పూర్తిచేసుకుంది. ఆ ఒక్క వారంలోనే హౌస్‌లో కావాల్సినన్ని గొడవలు, పంచాయితీలు, గ్రూపులు కట్టడాలు చూశాం. మధ్య మధ్యలో ఫన్నీ కన్వర్‌జేషన్లు, డాన్సులు కూడా చూశాం. శని, ఆదివారాల్లో కింగ్ నాగార్జున వచ్చి అందరికీ క్లాస్ పీకడం, వారిపై సెటైర్లు, వారి అన్న మాటలకు కౌంటర్లు ఇచ్చారు. అయితే ఈ వారం మాత్రం ఎలిమినేషన్ లేకుండా చేశారు. ఓటింగ్ లెక్కల ప్రకారం ఇనయా సుల్తానా, అభినయశ్రీ చివరి రెండు స్థానాల్లో నిలిచారు. వారిని గార్డెన్‌లో హ్యామెర్ లిఫ్ట్ చేయాలని పంపారు. ఎవరు లిఫ్ట్ చేయలేకపోతే వాళ్లు ఎలిమినేట్ అంటూ పంపారు. తీరా చూస్తే ఇద్దరూ హ్యామెర్ లిఫ్ట్ చేశారు. అది చూసి నాగార్జున ఇద్దరూ లిఫ్ట్ చేస్తే ఇద్దరూ సేఫ్. ఈ వారం ఎలిమినేషన్ లేనట్లే అంటూ చెప్పుకొచ్చాడు.
ఎలిమినేషన్ లేదు అని చెప్పడంతో హౌస్‌లో ఆనందాలు వెల్లి విరిసాయి. కానీ, ఎంతో సేపు ఆ ఆనందం లేదులెండి. ఎందుకంటారా? సోమవారం బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అంటే ఆ నామినేషన్లు ఆదివారం రాత్రికే షూట్ చేస్తారు. ఎలిమినేషన్ లేదనే ఆనందం నుంచి నామినేషన్లో రీజన్లతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా చాలా కొత్తగా ట్రై చేశారు. ఒక బావి పెట్టి పక్కన కుండలు పెట్టారు. ఎవరిని నామినేట్ చేస్తే వారి పేరు చెప్పి వాళ్ల కుండ బావిలో పడేయాలి. అయితే మొదటివారం అంతా నామినేషన్లో ఎంతో కూల్‌గా రియాక్ట్ అయ్యారు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. నామినేషన్లో వాదనలు, విమర్శలు, పెదవి విరుపులు చాలానే ఉన్నాయి.
బిగ్ బాస్ హౌస్‌లో రెండో వారం నామినేషన్స్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. మొదటి వారం ఏడుగురు నామినేట్ అవ్వగా.. రెండో వారం మాత్రం ఆ లిస్టు 8కి చేరింది. అంటే హౌస్‌లో అసలు రచ్చ మొదలైందనే చెప్పాలి. అసలు రెండోవారంలో ఎవరు నామినేషన్స్ లో ఉన్నారో చూద్దాం.. గలాటా గీతూ, అభినయశ్రీ, మరీనా-రోహిత్(ఒక కంటెస్టెంట్ కిందే కౌంట్), షానీ సాల్మన్, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, రేవంత్‌లు నామినేషన్‌లో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా నామినేషన్లో పెద్దఎత్తున వాదోపవాదనలు జరిగాయి. కానీ, మరీనా- రోహిత్, షానీలాంటి పేర్లు నామినేషన్ లిస్టులో ఉండటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే వాళ్లు ఎవరితో గొడవ పడటం, కయ్యానికి కాలు దువ్వడం అయితే చూసింది లేదు. ఈ వారం నామినేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.